వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా సరికొత్త ఈవీ పాలసీ 2.0ని రూపొందిస్తోంది దిల్లీ ప్రభుత్వం. రోడ్ల మీద ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచే విధంగా ఈ పాలసీలో అనేక రూల్స్ ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు, ఈవీ కొనే మహిళలకు దిల్లీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ని కూడా ఇస్తుందని సమాచారం. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనే దిల్లీ మహిళలకు షరతులతో కూడిన రూ. 30వేల సబ్సిడీని ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఈవీ పాలసీ 2.0 ముసాయిదా కాపీని హిందుస్థాన్ టైమ్స్ సేకరించింది. ఇందులో అనేక వివరాలు బయటకు వచ్చాయి.
దిల్లీ ఈవీ పాలసీ 2020.. ఆగస్టు 2023 లో ముగియాల్సి ఉంది. అప్పటి నుంచి దీన్ని పొడిగిస్తూ వస్తోంది ప్రభుత్వం. 2025 ఏప్రిల్ మధ్య నాటికి కొత్త విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముసాయిదా ఇప్పటికే రెడీ అయ్యింది. దీనికి దిల్లీ కేబినెట్ అమోదం తెలపాల్సి ఉందు.
ఈ ముసాయిదాలో రూ.30,000 సబ్సిడీ విధివిధానాలను వెల్లడించలేదు. కానీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న, దిల్లీలో నివసించే మహిళలందరికీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తే రూ .10,000 / కిలోవాట్ చొప్పున రూ .30,000 వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తామని ముసాయిదా పాలసీ పేర్కొంది. మొదటి 10,000 మంది దరఖాస్తుదారులకు ఈ ప్రోత్సాహకం అందనుంది.
నగరవాసులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల్లో ఇదొక్కటే ఉందని పాలసీ వివరాలు తెలిసిన అధికారులు చెబుతున్నారు.
“ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి అనేక ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపును కూడా ప్రభుత్వం కొనసాగించే అవకాశం ఉంది. కొన్ని గూడ్స్ వాహనాల కేటగిరీలను.. గుర్తించిన రోడ్లపై నడపడం, నిరుపయోగంగా పార్కింగ్ చేయడంపై నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు,” అని దిల్లీ ఈవీ పాలసీ 2.0పై దిల్లీ రవాణా శాఖ అధికారి ఒకరు తెలిపారు.
వివిధ కేటగిరీల ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు వడ్డీ రాయితీ పథకానికి రవాణా శాఖ సహకరిస్తుంది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్ గూడ్స్ క్యారియర్స్ (ఎల్5ఎన్) కిలోవాట్కి రూ.10,000, రూ.45,000 వరకు, ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ గూడ్స్ క్యారియర్స్ (ఎన్1 కేటగిరీ) రూ.75,000 వరకు ప్రోత్సాహకాలు పొందడానికి అర్హులు.
అదనంగా, శిలాజ ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాలను స్క్రాప్ చేసే రిజిస్టర్డ్ యజమానులు (స్క్రాప్ చేసిన వాహనం 12 సంవత్సరాలకు మించకపోతే) రూ .10,000 అదనపు ప్రోత్సాహకానికి అర్హులు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పాత ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లు) ఆటో రిక్షాలను స్క్రాప్ చేసేవారికి రూ .20,000 స్క్రాపింగ్ ఇన్సెంటివ్ ఇచ్చే అవకాశం ఉంది.
10 సంవత్సరాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అన్ని సీఎన్జీ ఆటో రిక్షాలను ఈ-ఆటోలతో భర్తీ చేయాలని ఈ దిల్లీ పాలసీ 2.0లో ప్రత్యేక రూల్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఒక్కో వాహనానికి రూ.1,00,000 రీప్లేస్మెంట్ ఇన్సెంటివ్ కూడా ఇస్తారు.
ఘన వ్యర్థాలను పెద్ద సంఖ్యలో రవాణా చేసే శిలాజ ఇంధనంతో నడిచే వాహనాలను నగరపాలక సంస్థలు, సిటీ బస్సులు దశలవారీగా తొలగించాలని ముసాయిదా విధానం సిఫార్సు చేసింది. అదేవిధంగా, 2025 ఆగస్టు 15 నుంచి గూడ్స్ క్యారియర్ల విషయంలో డీజిల్, పెట్రోల్, సీఎన్జీ త్రీ వీలర్ రిజిస్ట్రేషన్లను అనుమతించకూడదని దిల్లీ ఈవీ పాలసీ 2.0లో ఉంది.
కొత్త పాలసీలోని ప్రతిపాదనల ప్రకారం, మూడొవ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. నగరంలో ప్రతి ఐదు కిలోమీటర్లకు 18000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. అన్ని కొత్త భవనాల్లోని పార్కింగ్ స్థలంలో కనీసం 20% ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రతిపాదనల్లో చేర్చారు. పాత భవనాలకు, మొత్తం పార్కింగ్ స్థలంలో 5% ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కేటాయించాలని పాలసీ ముసాయిదాలో ఉంది.
సంబంధిత కథనం