Deepak Chemtex IPO: ఎస్ఎంఈ సెగ్మెంట్లో మార్కెట్లోకి మరో ఐపీఓ; ఆకర్షణీయంగా జీఎంపీ; అప్లై చేయొచ్చా?
Deepak Chemtex IPO: చిన్న, మధ్య తరహా వ్యాపార విభాగం (SME) నుంచి మార్కెట్లోకి మరో ఐపీఓ వస్తోంది. కెమికల్స్ ఇండస్ట్రీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దీపక్ కెమ్టెక్స్ (Deepak Chemtex) ఐపీఓ నవంబర్ 29న ఓపెన్ అవుతోంది.
Deepak Chemtex IPO: కెమికల్స్ ఇండస్ట్రీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దీపక్ కెమ్టెక్స్ (Deepak Chemtex) ఐపీఓకు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (SME) కేటగిరీలోకి వస్తుంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 23.04 కోట్ల విలువైన మొత్తం 28.8 లక్షల ఫ్రెష్ షేర్లను ఇష్యూ చేస్తున్నారు.
దీపక్ కెమ్టెక్స్ వివరాలు..
Deepak Chemtex IPO: ఈ సంస్థ 1997 లో ప్రారంభమైంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దీపక్ కెమ్‌టెక్స్ ప్రధానంగా ఫుడ్, డ్రగ్, కాస్మెటిక్స్, క్లీనింగ్ కాంపౌండ్స్, అగ్రికల్చర్, ఇతర పరిశ్రమలకు అవసరమైన రంగుల తయారీ వ్యాపారంలో ఉంది. ప్రస్తుతం ఆహార, ఔషధ, కాస్మెటిక్ ఉత్పత్తుల సంస్థలకు కూడా సేవలను అందిస్తోంది. ఈ కలరంట్స్ ను చాక్లెట్స్, బేకరీ, స్వీట్స్, బేవరేజెస్, పాల ఉత్పత్తులు, సీజనింగ్స్, పెంపుడు జంతువుల ఆహారాలు, ఔషధ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. అలాగే, ఇంక్‌జెట్ పరిశ్రమలో ఉపయోగించే రంగులు, ఈత కొలనుల్లో ఉపయోగించే రంగులు, కార్ వాష్ ఉత్పత్తులలో ఉపయోగించే రంగులు, పోర్టబుల్ శానిటేషన్ క్లీనర్‌లు, డిటర్జెంట్స్, సబ్బులు, ఫ్యుయెల్స్, ఆయిల్, లూబ్రికెంట్లు, విత్తనాల శుద్ధిలో ఉపయోగించే రంగులు.. మొదలైన వాటిని కూడా దీపక్ కెమ్టెక్స్ తయారు చేస్తుంది.
100 కు పైగా దేశాల్లో..
ఆసియా, అమెరికా, యూరోప్ దేశాల్లోనూ ఈ సంస్థకు క్లయింట్స్ ఉన్నారు. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 100కి పైగా ఉత్పత్తులు ఉన్నాయి. చైనా, ఫ్రాన్స్, కెన్యా, మెక్సికో, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలకు ఈ సంస్థ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
ఐపీఓ వివరాలు..
- ఈ ఎస్ఎంఈ ఐపీఓ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు ఓపెన్ ఉంటుంది.
- ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 76 నుంచి రూ. 80 వరకు ఉంది.
- ఈ ఐపీఓలో ఒక్కో లాట్ లో 1600 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఒక లాట్ కు అప్లై చేయాలంటే కనీసం రూ. 1,28,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
- ఈ కంపెనీ ప్రమోటర్లు సౌరభ్ దీపక్ అరోరా, త్రిష్లా బెయిద్.
- ఈ ఐపీఓ లో 50% షేర్లు క్యూఐబీలకు, 15% షేర్లు ఎన్ఐఐలకు, 35% షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు.
- దీపక్ కెమ్టెక్స్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) మంగళవారం +28 గా ట్రేడ్ అవుతోంది. అంటే గ్రే మార్కెట్‌లో షేర్లు వాటి ఇష్యూ ప్రైస్ పై రూ. 28 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయని అర్థం.
సూచన: ఈ కథనం నిపుణుల సూచనలు, అభిప్రాయాలతో రూపొందించినది. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.