Bitcoin crash : క్రిప్టోపై ట్రంప్​ టారీఫ్​ దెబ్బ- భారీగా క్రాష్​ అయిన బిట్​కాయిన్​..-crypto crash bitcoin price today tumbles after trumps 100 percent china tariff ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bitcoin Crash : క్రిప్టోపై ట్రంప్​ టారీఫ్​ దెబ్బ- భారీగా క్రాష్​ అయిన బిట్​కాయిన్​..

Bitcoin crash : క్రిప్టోపై ట్రంప్​ టారీఫ్​ దెబ్బ- భారీగా క్రాష్​ అయిన బిట్​కాయిన్​..

Sharath Chitturi HT Telugu

క్రిప్టో మార్కెట్‌లో భారీ పతనం! బిట్‌కాయిన్, ఈథీరియం సహా అనేక ప్రముఖ క్రిప్టోకరెన్సీల ధరలు ఢమాల్ అయ్యాయి.డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయమే కారణమా? ఇక్కడ తెలుసుకోండి..

క్రిప్టోపై ట్రంప్​ టారీఫ్​ దెబ్బ (Reuters )

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం.. ప్రపంచవ్యాప్త క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ను కుప్పకూల్చింది! చైనా నుంచి దిగుమతి చేసుకునే “క్రిటికల్​ సాఫ్ట్‌వేర్” ఉత్పత్తులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత బిట్‌కాయిన్, ఈథీరియం సహా దాదాపు అన్ని ప్రముఖ క్రిప్టో కరెన్సీల ధరలు భారీగా పడిపోయాయి.

మీడియా నివేదిక ప్రకారం.. తయారీ రంగంలో, ముఖ్యంగా సాంకేతిక (టెక్నాలజీ) రంగంలో కీలకమైన రేర్​ ఎర్త్​ మినరల్స్​ ఎగుమతులను పరిమితం చేస్తామని చైనా ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్​ ఈ టారీఫ్​ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ రాజుకునట్టు అయ్యింది.

బిట్‌కాయిన్ 8% పతనం, ఈథీరియం 12% డౌన్..

కాయిన్‌మార్కెట్‌క్యాప్ ప్రకారం.. ఉదయం 6:10 గంటలకు బిట్‌కాయిన్ ధర 7.60 శాతం క్షీణించి $1,12,592.31 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఈథీరియం 12.24 శాతం తగ్గి $3845.92 కి పడిపోయింది.

కాయిన్‌మార్కెట్‌క్యాప్ విశ్లేషణ ప్రకారం.. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్, $1,20,000 మద్దతు స్థాయిని కోల్పోవడంతో ఒక్కసారిగా 9.5 బిలియన్ డాలర్ల విలువైన లిక్విడేషన్లను చూసింది.

క్రిప్టో మార్కెట్ అప్‌డేట్: ప్రముఖ 5 టోకెన్ల పరిస్థితి..

ఉదయం 6:45 గంటలకు, ప్రముఖ క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువలు ఈ విధంగా ఉన్నాయి:

బిట్‌కాయిన్- $111,841.14 (8.40% డౌన్​)- మార్కెట్​ క్యాప్​ $2.23 ట్రిలియన్లు (8.12% డౌన్​)

ఈథీరియం- $3,792.31 (15.62% డౌన్​)- మార్కెట్​ క్యాప్​ $456.97 బిలియన్లు (13.81% డౌన్​)

టెథర్- $1 (0.1% డౌన్​)- మార్కెట్​ క్యాప్​ $178.97 బిలియన్లు (0.28% డౌన్​)

బినాన్స్ కాయిన్- $1,094.09 (6.6% డౌన్​)- మార్కెట్​ క్యాప్​ $152.27 బిలియన్లు (12.91%)

ఎక్స్‌ఆర్‌పీ- $2.33 (22.85% డౌన్​)- మార్కెట్​ క్యాప్​ $140.19 బిలియన్లు (16.31%)

క్రిప్టో మార్కెట్ ఎందుకు కుప్పకూలింది? ట్రంప్ ఏమన్నారు?

రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతిపై చైనా వైఖరితో తాను సంతోషంగా లేనని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ వైఖరిని “అసాధారణంగా దూకుడు చర్య”గా ఆయన అభివర్ణించారు.

ట్రూత్ సోషల్ వేదికగా డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.

"వ్యాపార విషయంలో చైనా అసాధారణంగా దూకుడు వైఖరిని తీసుకుందని. నవంబర్ 1, 2025 నుంచి దాదాపు అన్ని ఉత్పత్తులపై భారీ ఎగుమతి నియంత్రణలను విధిస్తామని ప్రపంచానికి చాలా శత్రుత్వంతో కూడిన లేఖ పంపిందని ఇప్పుడే తెలిసింది. ఇది ఏ ఒక్క దేశాన్నీ మినహాయించకుండా, అన్ని దేశాలనూ ప్రభావితం చేస్తుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలోనే వినని విషయం, ఇతర దేశాలతో వ్యవహరించడంలో నైతికంగా పతనమైన చర్య," అని ట్రంప్ తన పోస్ట్‌లో రాశారు.

"చైనా వైఖరి నేపథ్యంలో, అమెరికా తరఫున మాత్రమే (ఇదేవిధంగా బెదిరింపులకు గురైన ఇతర దేశాల తరఫున కాకుండా), నవంబర్ 1, 2025 నుంచి (లేదా చైనా ఏమైనా చర్యలు మారిస్తే అంతకంటే ముందే), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనాపై ప్రస్తుతం ఉన్న సుంకాలతో పాటు అదనంగా 100% సుంకాన్ని విధిస్తుంది. అలాగే నవంబర్ 1 నుంచ, కీలకమైన అన్ని సాఫ్ట్‌వేర్‌లపై ఎగుమతి నియంత్రణలను కూడా అమలు చేస్తాము," అని ఆయన స్పష్టం చేశారు.

"చైనా ఇలాంటి చర్య తీసుకుంటుందని నమ్మడం కష్టం, కానీ వారు చేశారు. ఇక మిగతాదంతా చరిత్రే," అని ట్రంప్ హెచ్చరించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ వాణిజ్య ఉద్రిక్తతలు మరింత అనిశ్చితిని పెంచడంతో, క్రిప్టో మార్కెట్ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనై పతనమైంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం