Electric cars : మిడిల్ క్లాస్ వారి ముందు 4 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ ఆప్షన్స్- దేని రేంజ్ ఎక్కువ?
Electric cars with long range : హ్యుందాయ్ క్రేటా ఈవీ వర్సెస్ ఎంజీ విండ్సర్ ఈవీ వర్సెస్ టాటా కర్వ్ ఈవీ.. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో రేంజ్ పరంగా ఏది బెస్ట్? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఏ రేంజ్లో పెరుగుతోంది చూస్తూనే ఉన్నాము. కస్టమర్స్‌ని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మోడల్స్‌ని ఆటోమొబైల్ సంస్థలు లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఫలితంగా మిడిల్ క్లాస్ వారికి గతంతో పోల్చితే ఇప్పుడు మంచి ఆప్షన్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగానే హ్యుందాయ్ క్రేటాకి ఈవీ వర్షెన్‌ని భారతీయుల ముందుకు తీసుకురాబోతోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా కర్వ్ ఈవీతో పాటు త్వరలోనే లాంచ్ కానున్న మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి హ్యుందాయ్ క్రేటా ఈవీ గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో వీటిని పోల్చి, రేంజ్ విషయంలో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ క్రెటా ఈవీ వర్సెస్ ఎంజీ విండ్సర్ ఈవీ:
హ్యుందాయ్ క్రెటా ఈవీని రెండు బ్యాటరీల ఆప్షన్‌తో అందించనుంది. విండ్సర్ ఈవీలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ అందించే 38 కిలోవాట్ల బ్యాటరీతో పోల్చితే క్రేటాలోని చిన్న బ్యాటరీ (42 కిలోవాట్లు) సామర్థ్యం కొంచెం పెద్దది. ఈ ఎంజీ ఎలక్ట్రిక్ వాహనం ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ. రూ .9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన విండ్సర్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ బ్యాటరీ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 55 నిమిషాల్లో 80 శాతం వరకు రీఛార్జ్ చేయగలదు.
విండ్సర్ ఈవీతో పోలిస్తే, క్రెటా ఈవీ చిన్న బ్యాటరీతో 390 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 58 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు రీఛార్జ్ చేయగలదని కార్ల తయారీ సంస్థ తెలిపింది.
హ్యుందాయ్ క్రెటా ఈవీ వర్సెస్ టాటా కర్వ్ ఈవీ..
రాబోయే హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ టాటా కర్వ్ ఈవీకి పోటీగా ఉంటుంది. బ్యాటరీ పరిమాణం, శ్రేణి పరంగా.. క్రెటా ఈవీ టాటా ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీకి దగ్గరి పోటీదారు అని చెప్పుకోవాలి. 42 కిలోవాట్ల బ్యాటరీతో పాటు క్రెటా ఈవీలో 51.4 కిలోవాట్ల పెద్ద యూనిట్ కూడా ఉంటుంది. కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్లతో అందుబాటులో ఉంది. అవి.. 45 కిలోవాట్, 55 కిలోవాట్ల యూనిట్. క్రెటా ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంని తెలుస్తోంది. బ్యాటరీ పరిమాణాన్ని బట్టి కర్వ్ ఈవీ రేంజ్ 430 కిలోమీటర్ల నుంచి 502 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా ఈవీ వర్సెస్ మారుతీ సుజుకీ ఈ విటారా..
కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సెగ్మెంట్లో క్రెటా ఈవీకి ప్రధాన ప్రత్యర్థిగా రాబోయే మారుతీ సుజుకీ ఈ విటారా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల ఐసీఈ వర్షెన్లు అయిన క్రెటా, గ్రాండ్ విటారా ఎస్‌యూవీలకు సూపర్ డిమాండ్, దానికి మించిన సూపర్ పోటీ ఉంది. మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ వాహనంలో 49 కిలోవాట్, 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో ప్రత్యర్థుల కంటే అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యాన్ని అందుస్తుంది. ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ని అందించగలదని మారుతీ సంస్థ తెలిపింది. అయితే బ్యాటరీకి సంబంధించిన కరెక్ట్ రేంజ్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. పెద్ద బ్యాటరీ ఉన్న క్రెటా ఈవీ రేంజ్ పరంగా ఎంట్రీ లెవల్ ఈ విటారా వేరియంట్‌తో పోటీ పడుతుందని భావిస్తున్నారు.
ఈ మారుతీ సుజుకీ ఈ విటారా.. ఈ నెలలో జరగనున్న భారత మొబిలిటీ ఎక్స్పో 2025లో లాంచ్కానుంది.
సంబంధిత కథనం