‘చాయ్ కే సరిపోతుంది..’ అంటూ ఫ్రెషర్లకు కాగ్నిజంట్ ఇచ్చిన శాలరీ ఆఫర్ పై నెటిజన్ల వెక్కిరింతలు
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ కాగ్నిజంట్ తన ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు ఆఫర్ చేసిన వార్షిక వేతనం వైరల్ గా మారింది. ఫ్రెషర్లకు ఏడాదికి కేవలం రూ. 2.5 లక్షలే ఆఫర్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ శాలరీ టీ ఖర్చులకు మాత్రం సరిపోతుందంటూ వెక్కిరిస్తున్నారు.
కంపెనీ ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో కాగ్నిజెంట్ ఆఫర్ చేసిన జీతాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో చర్చకు దారితీశాయి. కాగ్నిజెంట్ సంస్థ ఫ్రెషర్లకు ఇటీవల రూ .2.5 లక్షలు వార్షిక వేతన ప్యాకేజీని ఆఫర్ చేసింది. సాధారణంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కనీసం రూ .3.5 లక్షల నుండి రూ .4 లక్షల వరకు వార్షిక వేతనాలను కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. అయితే, ఐటీ కంపెనీలు ఈ మధ్య తమ ప్రాఫిట్ మార్జిన్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్నాయి.
కాగ్నిజంట్ చుట్టూ వివాదం ఎందుకు?
2024 బ్యాచ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేళ్ల ఫుల్ టైమ్ డిగ్రీ ప్రోగ్రామ్ తో గ్రాడ్యుయేట్ అయిన అభ్యర్థులకు రూ.2.5 లక్షల ప్యాకేజీని అందిస్తున్నట్లు కాగ్నిజంట్ (Cognizant) తెలిపింది. ఈ ప్యాకేజీపై సోషల్ మీడియాలో పలువురు యూజర్లు ప్రశ్నలు సంధించారు. ఒక చిన్న పట్టణంలో ఏడాది అద్దె, కొన్ని మ్యాగీ ప్యాకెట్లకు కూడా ఇది సరిపోదని ఓ యూజర్ పేర్కొన్నారు. ప్రజలు కేవలం చాయ్ తో పాటు బతుకుపై ఆశతో బతకగలరో లేదో తెలుసుకోవడానికి కాగ్నిజెంట్ చేసిన ప్రయోగం ఇదని ఒక యూజర్ మండిపడ్డారు.
విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్
కాగ్నిజెంట్ ప్రత్యర్థి విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2024ను ప్రారంభించింది. ఇది బీసీఏ , B.Sc విద్యార్థులకు డిగ్రీ చదువుతున్నప్పుడు ఐటి సంస్థలో పనిచేసే అవకాశాన్ని అందిస్తుంది. ఇక్కడ ఫ్రెషర్లకు రూ.75 వేలను ఏకమొత్త బోనస్ గా అందిస్తారు. అలాగే, నెలకు రూ.15,000 స్టైఫండ్, రూ.488 ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఇది మొదటి ఏడాది సంవత్సరానికి రూ.2.6 లక్షలుగా ఉంటుందని విప్రో (wipro) జాబ్ పోస్టింగ్ తెలిపింది. రెండో ఏడాది ఎలాంటి బోనస్ కాంపోనెంట్ లేకపోవడంతో నెలకు రూ.17,000 స్టైఫండ్, రూ.533 ఈఎస్ఐ కవరేజీ అంటే ఏడాదికి రూ.2.1 లక్షలు లభిస్తాయి.