Stock Market : మళ్లీ పైకి లేచిన కొచ్చిన్ షిప్‌యార్డ్ స్టాక్.. కానీ ఇలాగే కొనసాగుతుందా?
Cochin Shipyard Ltd Share Price : కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ స్టాక్ ధర చాలా రోజుల తర్వాత పెరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ షేరు మంచి పనితీరు కనబరచడానికి తాజాగా తీసుకున్న నిర్ణయాలే కారణం. అయితే ఈ స్టాక్ గత రెండు నెలల్లో సుమారు 30 శాతం పడిపోయింది.
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. తాజాగా స్టాక్ మార్కెట్‌లో మంచి పనితీరును కనబరిచింది. గత ఏడాది కాలంలో ఈ షేరు 300 శాతానికి పైగా లాభపడింది. ఈ స్టాక్ జూలై 8, 2024న రికార్డు స్థాయిలో రూ.2977.10కి చేరుకుంది. అయితే తర్వాతి రోజుల్లో దిగువకు పడిపోయింది. గత రెండు నెలల్లో ఈ షేరు దాదాపు 30 శాతం నష్టపోయింది.
అయితే బుధవారం స్టాక్ మార్కెట్ తొలి సెషన్‌లో ఈ షేరు మంచి లాభాలను ఆర్జించింది. ఈ షేరు మెుదట్లో ఆరు శాతానికి పైగా లాభపడింది. దీని వెనక కారణాలు ఏంటో చూద్దాం..
కొచ్చిన్ షిప్‌యార్డ్‌తో సహా భారత నౌకా నిర్మాణ సంస్థలు రూ.1.45 లక్షల కోట్ల విలువైన మూలధన సేకరణ ప్రతిపాదనలకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ స్టాక్ పెరుగుదలకు ఆజ్యం పోసింది.
NSEలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ప్రస్తుతం (12.41 PM) రూ. 1,932.05. గత ఐదు రోజుల్లో ఈ షేరు 3.03 శాతం నష్టపోయింది. ఒక నెల క్షీణత 19.48 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా ఆరు నెలల వృద్ధిని పరిశీలిస్తే ప్రభుత్వ రంగ వాటా 120 శాతం పురోగతిని సాధించింది. 2024లో ఇప్పటివరకు ఈ షేరు 184.88 శాతం అడ్వాన్స్‌ను సాధించగలిగింది.
కొచ్చిన్ షిప్‌యార్డ్ గత ఏడాది కాలంలో 325.17 శాతం వృద్ధితో మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో చేరింది. అంటే గత ఏడాది కాలంలో ఈ స్టాక్ తన హోల్డర్లకు మంచి రాబడిని ఇవ్వగలిగింది. ఈ స్టాక్ గత కొన్ని రోజులుగా భారీ క్షీణతను ఎదుర్కొంటోంది. అయితే బుధవారం ఈ షేరు లాభాలను ఆర్జించింది. మరి రానున్న రోజుల్లో కూడా ఈ స్టాక్ ర్యాలీ కొనసాగుతుందో లేదో చూడాలి.
టెక్నికల్ అనలిస్ట్ సర్వేంద్ర శ్రీవాస్తవ ప్రకారం, కొచ్చిన్ షిప్‌యార్డ్ షేర్లు రూ.100 నుండి రూ.150 వరకు మరింత క్షీణించే అవకాశం ఉంది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ కొచ్చిన్ షిప్‌యార్డ్ కోసం రూ.740గా అంచనా వేసింది. అంతకుముందు షేరు ధర రూ.540. అయినప్పటికీ బ్రోకరేజ్ స్టాక్‌పై అమ్మకపు కాల్‌ను కొనసాగించింది.
సాంకేతిక అంశాల పరంగా స్టాక్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) 29.2 వద్ద ఉంది. చార్టులలో స్టాక్ అధికంగా అమ్ముడయ్యిందని ఇది సూచిస్తుంది. కొచ్చిన్ షిప్‌యార్డ్ షేర్లు 5-రోజులు, 10-రోజులు, 20-రోజులు, 30-రోజులు, 50-రోజులు, 100-రోజుల మూవింగ్ అవరేజ్ కంటే తక్కువగా ట్రేడవుతున్నాయి. అయితే 150-రోజులు, 200-రోజుల మూవింగ్ అవరేజ్ కంటే ఎక్కువగా ఉన్నాయి.
గమనిక : ఇది స్టాక్ పనితీరు గురించి మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయండి.