ఇటివలి కాలంలో ఇండియాలో “డార్క్ ఎడిషన్” కార్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌కి డార్క్ ఎడిషన్‌ని తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలోకి సిట్రోయెన్ కూడా చేరింది. బసాల్ట్ కూపే ఎస్‌యూవీకి డార్క్ ఎడిషన్‌ని సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇది త్వరలోనే లాంచ్ అయ్యే సూచనలు సైతం కనిపిస్తున్నాయి. రాబోయే బసాల్ట్ డార్క్ ఎడిషన్‌ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సంస్థ ఇప్పటికే టీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సిట్రోయెన్ బసాల్ట్ గత సంవత్సరం ప్రారంభంలో ఇండియా స్పెసిఫిక్ సీ-క్యూబ్ ప్లాట్‌ఫామ్ కింద మూడవ మోడల్‌గా విడుదలైంది. ఇటీవల విడుదలైన టీజర్.. సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ మొత్తం నలుపు రంగు ఎక్స్టీరియర్ని పొందుతుందని, క్రోమ్ బిట్స్ స్థానంలో డార్క్ క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటాయని సూచిస్తోంది. అంటే ఫ్రెంట్ గ్రిల్‌లోని క్రోమ్ స్లాట్స్, సిట్రోయెన్, బసాల్ట్ బ్యాడ్జీలు డార్క్ క్రోమ్ కలర్ థీమ్‌ను పొందుతాయి. ఇది కాకుండా, డ్యూయెల్ టోన్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ యథాతథంగా ఉంటాయని టీజర్‌ని చూస్తే తెలుస్తోంది.
సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్యూవీ డార్క్ ఎడిషన్ లోపల డార్క్ థీమ్ కొనసాగుతుంది. ఈ టీజర్లో బ్లాక్ అప్హోలిస్టరీతో కూడిన మొత్తం బ్లాక్ ఇంటీరియర్‌ను చూపించారు. ఇది కాకుండా, బసాల్ట్ బ్లాక్ ఎలిమెంట్స్‌తో అదే ఇంటీరియర్ లేఔట్‌ను నిలుపుకుంటుందని భావిస్తున్నారు. దీని అర్థం డ్యాష్‌బోర్డు గోధుమ- బ్రాంజ్ కలర్ థీమ్‌కు బదులుగా సింగిల్ టోన్ బ్లాక్ లేఔట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఏసీ కంట్రోల్ కోసం స్విచ్‌లను కూడా డార్క్ క్రోమ్ ఫినిష్ చేసే అవకాశం ఉంది.
కొత్త వాహనంలో ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు! బసాల్ట్‌లో వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. భద్రత విషయానికొస్తే.. ఈ కూపే ఎస్‌యూవీలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్ బ్యాగులు, ఈఎస్సీ, పార్కింగ్ సెన్సార్లతో కూడిన రేర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) ఉన్నాయి.
సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ టాప్ స్పెక్ వేరియంట్‌కు పరిమితం కానుంది! అంటే బసాల్ట్ డార్క్ ఎడిషన్ 1.2-లీటర్ 3 సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 109 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో 6-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉంటాయి. టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ లీటరుకు 18.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఇక లాంచ్ టైమ్‌కి ఈ సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్యూవీ డార్క్ ఎడిషన్‌పై మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, సీ3 కూడా ఈ ఏడాది చివరిలో డార్క్ ఎడిషన్‌ని పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.
సంబంధిత కథనం