సినీ, సాంస్కృతిక కార్యకర్తలను ఆదుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఫీజులను పెంచేందుకు సిద్ధపడింది. ఈ మేరకు సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లపై కొత్త పన్ను విధించాలని యోచిస్తోంది. వాటిపై 1 శాతం నుంచి 2 శాతం వరకు సెస్ విధించాలని కోరుతూ కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్మికుల (సంక్షేమం) బిల్లును శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అదనపు నిధులను సినీ కళాకారులు, సాంస్కృతిక కళాకారులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్టు ఆ బిల్లులో ఉంది.
“సినిమా టికెట్లు, సబ్స్క్రిప్షన్ ఫీజులు, ఇతర రెవెన్యూలపై సెస్‌ని విధిస్తాము. దీనిని సినీ- సాంస్కృృతిక కార్యకర్తల సంక్షేమ సెస్‌గా పిలుస్తాము. ఈ సెస్‌ని ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. కాగా ఇది 2శాతానికి మించదు. ఒక శాతం కన్నా తక్కువ ఉండదు,” అని బిల్లు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ప్రదర్శించే నాటకాలకు సెస్‌ను విస్తరించే యోచనలో ఉన్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి మహ్మద్ మొహ్సిన్ తెలిపారు. ఈ ఆదాయాన్ని సినీ కార్మికులకు సామాజిక భద్రతా పథకాలకు వినియోగించనున్నట్టు పేర్కొన్నారు.
ఈ బిల్లు అమల్లోకి వచ్చిన అనంతరం సినీ ప్రియులపై భారం పడనుంది. ఇప్పటికే సినిమా బట్టి టికెట్ రేట్లు మారిపోతున్నాయి. పైగా బెంగళూరు వంటి నగరాల్లో ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి.
కన్నడిగుల ఉద్యోగ రిజర్వేషన్ల బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం వివాదంలో చిక్కుకున్న కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 50 శాతం, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనకు పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ప్రకటించారు.
ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదించిన బిల్లును తాత్కాలికంగా నిలిపివేశారు. “రాబోయే రోజుల్లో దీనిని పునఃసమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఇంకా తయారీ దశలోనే ఉంది. తదుపరి కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం,” అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం