చైనా ఉత్పత్తులపై సుంకాలను 245 శాతానికి పెంచిన ట్రంప్; చైనాతో చర్చలపై వ్యాఖ్యలు-china to now pay up to 245 percent tariffs on imports to us trumps latest move ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  చైనా ఉత్పత్తులపై సుంకాలను 245 శాతానికి పెంచిన ట్రంప్; చైనాతో చర్చలపై వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులపై సుంకాలను 245 శాతానికి పెంచిన ట్రంప్; చైనాతో చర్చలపై వ్యాఖ్యలు

Sudarshan V HT Telugu

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఇరు దేశాలు పరస్పరం అధిక సుంకాలు విధించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. చైనాపై మరోసారి టారిఫ్ లను పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. చైనాతో చర్చలకు సంబంధించి ‘బాల్ చైనా కోర్టులోనే ఉంది’ అని వ్యాఖ్యానించారు.

చైనా ఉత్పత్తులపై సుంకాలను 245 శాతానికి పెంచిన ట్రంప్

చైనా వస్తువులపై అమెరికా మరోసారి సుంకాలను పెంచింది. తాజా పెంపుతో చైనా ఉత్పత్తులపై యూఎస్ విధించిన సుంకాలు 245 శాతానికి పెరిగాయి. టారిఫ్ లపై చర్చలకు రావాలని అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఒత్తిడి పెంచుతున్నారు. 'బంతి చైనా కోర్టులో ఉంది. చైనా మనతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారితో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు' అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు.

చైనాకే అవసరం

అమెరికాతో చర్చలు జరిపి సుంకాలపై ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం చైనాకే ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. తమకు మిగతా దేశాల మాదిరిగానే చైనా కూడా అని, ఆ దేశంతో తమ వాణిజ్యంతో ప్రత్యేకత ఏమీ లేదని స్పష్టం చేసింది.

చైనా స్పందన

చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలను మరోసారి పెంచడంపై చైనా స్పందించారు. అమెరికా నిజంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే, తమపై ఒత్తిడిని ఉపయోగించడం మానేయాలి. బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లను ఆపాలి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ వ్యాఖ్యానించారు. ఏ చర్చ జరగాలన్నా అది సమానత్వం, గౌరవం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికలుగా ఉండాలని లిన్ అన్నారు.

చైనా కొత్త వాణిజ్య రాయబారి

అంతర్జాతీయ వాణిజ్య సంప్రదింపుల ప్రతినిధి, ఉప వాణిజ్య మంత్రిగా లీ చెంగ్ గాంగ్టోను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నియమించారు. ట్రంప్ తొలి టర్మ్ లో వాణిజ్య చర్చల్లో ప్రధాన పాత్ర పోషించిన వాంగ్ షౌవెన్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. అమెరికా కంటే రాజకీయంగా, ఆర్థికంగా సుస్థిర భాగస్వామిగా తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు చైనా ప్రపంచ వ్యాప్తంగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఆ మిషన్ ను దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రస్తుతం వారం రోజుల పాటు ఆగ్నేయాసియాలో పర్యటిస్తున్నారు. అమెరికాకు బోయింగ్ జెట్ ల డెలివరీలను చేపట్టవద్దని విమానయాన సంస్థలను బీజింగ్ మంగళవారం ఆదేశించింది.

ట్రంప్ టారిఫ్ వార్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య లోటు ఉన్న డజన్ల కొద్దీ దేశాలపై పరస్పర సుంకాలు విధించారు. వాణిజ్య ఒప్పందం కోసం పలు దేశాలు అమెరికా యంత్రాంగంతో చర్చలు ప్రారంభించడంతో 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. కొత్త వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు ఇప్పటికే 75కు పైగా దేశాలు సంప్రదించాయని వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ తెలిపింది. ప్రస్తుతానికి అమెరికా దిగుమతులపై 10 శాతం బేస్ లైన్ టారిఫ్ వర్తిస్తుంది.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం