Children's Day Gifts : చాక్లెట్లు, బొమ్మలే కాదు.. ఈ పెట్టుబడులూ పిల్లలకు గిఫ్ట్‌గా ఇవ్వండి
Children's Day Financial Gifts : నవంబర్ 14 బాలల దినోత్సవం. ఈరోజున పిల్లలకు ఏదో ఒకటి కొనిచ్చే బదులుగా ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసి వారికి గిఫ్ట్‌గా ఇవ్వండి. వారి బంగారు భవిష్యత్తుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రతి ఏటా 14 నవంబర్ పిల్లలందరికీ చాలా స్పెషల్ డే. బాలల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పిల్లల కోసం వివిధ కార్యక్రమాలు జరుపుకొంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు వివిధ రకాల బహుమతులు కూడా ఇస్తారు. మీరు కూడా మీ పిల్లలకు 2024 బాలల దినోత్సవం రోజున ఏదైనా ప్రత్యేక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నారా? అయితే చాక్లెట్లు, బొమ్మలు ఇవ్వడం కాదు.. వారి భవిష్యత్తు బాగుండాలంటే.. పెట్టుబడులను బహుమతిగా ఇవ్వండి. అందుకోసం ఈ ఐడియాలు చూడండి..
పిల్లల కోసం పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల ఆర్థిక భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఉంటారు. ఆర్డీ, ఎఫ్‌డీలాంటి వివిధ పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెడితే వారి భవిష్యత్తు బాగుంటుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా పిల్లల కోసం పెట్టుబడి పెట్టడం మెుదలుపెట్టవచ్చు. ఇందులో మీకు సురక్షితమైన పెట్టుబడి హామీ కూడా లభిస్తుంది. అంతేకాదు మెచ్యూరిటీ సమయంలో మంచి వడ్డీ కూడా పొందుతారు.
పిల్లలకు ఫైనాన్స్ గురించిన సమాచారం ఇవ్వాలి. దాని ప్రాముఖ్యతను వారికి అర్థమయ్యేలా చేయడం తల్లిదండ్రులు కచ్చితంగా చేయాలి. పిల్లల తరపున పొదుపు ఖాతాలను ఓపెన్ చేయాలి. అధిక వడ్డీ రేట్లు, తక్కువ నిర్వహణ రుసుములు వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉంటాయి. ఈ పొదుపు ఖాతా పిల్లలు తమ డబ్బును ప్లాన్ చేసుకోవడం, ఆసక్తిని అర్థం చేసుకోవడం, టార్గెట్ నిర్దేశించడం గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇవి పిల్లల డబ్బు పెరగడానికి సురక్షితంగా ఉంటాయి.
పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా కాపాడాలంటే.. త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే చాలా మంచిది. పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి మీరు SIPలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో నెలనెలా చిన్నపాటి పెట్టుబడి పెడితే.. మీ పిల్లలు పెద్దయ్యే సమయానికి లక్షల్లో ఫండ్ సిద్ధంగా ఉంటుంది. వారి చదువుకో, పెళ్లికో ఇది మీకు ఉపయోగపడుతుంది.
సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకంగా బాలికల కోసం ఉంది. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడానికి పిల్లల వయస్సు 10 సంవత్సరాలు ఉండాలి. అయితే మీరు సుకన్య సమృద్ధి యోజనలో 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజనలో రూ. 250 నుండి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో మీకు 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు అనేక బ్యాంక్ ఎఫ్‌డిల కంటే బెటర్.
గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) అనేది తక్కువ రిస్క్‌తో మెరుగైన రాబడిని అందించే పెట్టుబడి ఆప్షన్. అదే సమయంలో స్టాక్ మార్కెట్ కంటే తక్కువ రిస్క్ ఉంటుంది. ఇది మంచి రాబడిని ఇస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు.
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్ వాత్సల్య) కింద దేశంలోని పిల్లలందరి భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ఇటీవల ఏర్పాట్లు చేసింది. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహించే పథకం. దీని కింద తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించవచ్చు. పిల్లలకు రూ.1000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు.