ఈ కాలంలో మనల్ని ఎవరూ గమనించడం లేదూ అనుకోవడం చాలా తప్పు. డబ్బు లావాదేవీలు చేసినా పెద్దగా పట్టించుకోరు అనుకోవద్దు. కచ్చితంగా ఐటీ శాఖ కన్ను ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తోంది. మీ ఖర్చు, ఆదాయానికి మధ్య అంతరాన్ని గుర్తించడానికి డేటా విశ్లేషణ, ఏఐని వాడుతుంది. మీ ఆదాయానికి ఖర్చులకు మధ్య వ్యత్యాసం ఉంటే నోటీసు పంపి దర్యాప్తు ప్రారంభించవచ్చు. ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడానికి కారణాలను తెలుసుకుందాం..
ప్రతి నెలా రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే అది కూడా పన్ను శాఖ రికార్డులలోకి వెళ్తుంది. దీని వలన మీకు నేరుగా ఐటీ నోటీసు రావచ్చు. మీకు ఈ నగదు అంతా ఎక్కడి నుండి వస్తుంది? అని అడుగుతారు. ఈ లావాదేవీలను డిజిటల్‌గా చేయడం మంచిది.
ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తే ఆ మొత్తానికి మూలాన్ని మీరు చెప్పాలి. నగరాల్లో ఈ పరిమితి రూ.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షలు. ఈ పరిమితి కొన్ని రాష్ట్రాల్లో మరింత కఠినంగా ఉండవచ్చు. మీరు నగదు రూపంలో చెల్లింపు చేసి దాని మూలాన్ని వెల్లడించకపోతే పన్ను శాఖ మీ ఆదాయ రుజువును అడుగుతుంది. రిజిస్ట్రేషన్ పత్రాలలో చూపించవచ్చు, ఫారం 26QB ద్వారా తెలియజేయవచ్చు.
చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఎఫ్‌డీలను నగదు రూపంలో ఉంచితే అది ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళ్తుంది. ఒక సంవత్సరంలో వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ఎఫ్‌డీ మొత్తం రూ.10 లక్షలు దాటితే ఐటీ శాఖకు తెలుస్తుంది. ఎఫ్‌డీ పెట్టే ముందు మీరు చెప్పే ఆదాయ వనరు స్పష్టంగా ఉండాలి.
ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు పొదుపు ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేస్తే బ్యాంక్ ఈ సమాచారాన్ని ఐటీ శాఖకు నివేదిస్తుంది. అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని పన్ను శాఖ కచ్చితంగా అడగవచ్చు. సమాధానం సంతృప్తికరంగా లేకుంటే లేదా మీ ఆదాయానికి సరిపోలకపోతే జరిమానా విధించవచ్చు.
ఒక సంవత్సరంలో స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్లలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఈ సమాచారం ఐటీ శాఖకు వెళుతుంది. వెంటనే నోటీసు పంపకపోయినా.. మీ ఆదాయానికి, మీ పెట్టుబడులకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంటే దర్యాప్తు మెుదలు కావొచ్చు.
నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిపితే మీకు ఎలాంటి సమస్య ఉండదు. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, పెట్టుబడి రుజువు, నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిపే ఖాతా అంటే వారసత్వం, వ్యాపార ఆదాయం లాంటివి. మీకు అనుమానాలు ఉంటే సీఏను సంప్రదించవచ్చు.
సంబంధిత కథనం