ఎంతో కష్టపడి హైదరాబాద్‌లాంటి నగరంలో ఇల్లు కొనాలన్న కలను సాకారం చేసుకుంటారు. ఇందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతారు. కొత్త ఇంట్లో నివసించడం ప్రారంభిస్తారు. కానీ వర్షాకాలం మెుదలుకాగానే ఇల్లు లీక్ అవుతోంది. ఇంటి పెయింట్ రాలిపోతుంది. టీవీని ఫిక్స్ చేసే ప్రయత్నంలో గోడలోకి డ్రిల్లింగ్ చేసినప్పుడు ప్లాస్టర్ వస్తుంది. దీంతో విసుగు చెంది మీ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సొసైటీకి ఫిర్యాదు చేస్తారు. మీరు సమాధానం కోసం చూసినప్పుడల్లా రివ్యూ చేస్తున్నామని చెబుతారు. తిరిగి తిరిగి అలసిపోతారు. అలాంటి సమయంలో ఏం చేయాలి?
చాలా మంది ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు బడ్జెట్, లొకేషన్‌ను మాత్రమే చూస్తారు. నిర్మాణ నాణ్యతను పట్టించుకోవడం లేదు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అలాంటి వాటిల్లో చిక్కుకోకుండా చూసుకోవడానికి ఇల్లు కొనే ముందు ఇంటి నిర్మాణం నాణ్యతను తనిఖీ చేయడం మంచిది. ఇల్లు లేదా ఫ్లాట్‌ని బుక్ చేసుకునే ముందు కాస్త రీసెర్చ్ చేస్తే ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. మీరు ప్రాజెక్ట్ సైట్‌కు వెళ్లాలి. బిల్డింగ్ కట్టేటప్పుడు కాంక్రీటు, ఇటుకతోపాటుగా వివిధ సమాచారం పొందాలి. నిర్మాణ నాణ్యత ధృవీకరణ పత్రాన్ని అక్కడి స్ట్రక్చరల్ ఇంజనీర్ నుండి కూడా పొందవచ్చు.
గతంలో బిల్డర్ నిర్మించిన ప్రాజెక్టులు గురించి ఆరా తీయవచ్చు. నిర్మాణ నాణ్యతపై నివాసితులు సంతృప్తిగా ఉన్నారా? అని చూడొచ్చు. ఇది మీరు చేయగల చాలా సులభమైన పద్ధతి. స్థానిక అధికారులు జారీ చేసిన పర్మిషన్ సర్టిఫికేట్‌లు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌లను చూపించమని మీరు డెవలపర్‌ని అడగవచ్చు. ప్రాజెక్ట్ ప్రస్తుత బిల్డింగ్ బైలాస్, ఇతర చట్టాలకు అనుగుణంగా ఉందని ధృవపత్రాలు మీకు చెబుతాయి.
ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఫినిషింగ్, వంటగది, టాయిలెట్ ఫిట్టింగ్‌లు, టైల్స్, ఇతర వస్తువుల నాణ్యతను తనిఖీ చేయాలి. వాటిలో ఏవైనా లోపాలు ఉంటే వాటి గురించి లిస్ట్ రాసుకోవాలి. దాన్ని పరిష్కరించమని డెవలపర్‌కి చెప్పాలి. నిర్మాణ నాణ్యతను తనిఖీ చేయడానికి మీరు స్ట్రక్చరల్ ఇంజనీర్ సహాయం కూడా తీసుకోవచ్చు. నిర్మాణ నాణ్యత సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి వారు బిల్డింగ్ లేఅవుట్, డిజైన్, నిర్మాణ సామగ్రిని చెక్ చేస్తారు. పాత ఇంటిని కొనుగోలు చేస్తే, దాని సామర్థ్యాన్ని తనిఖీ చేయడానికి స్ట్రక్చరల్ ఇంజనీర్‌ను వాడుకోవచ్చు.
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్(RERA) నిర్మాణ ప్రమాణాలలో అవసరమైన మెరుగుదలకు ఉపయోగపడుతుంది. బిల్డర్ పేర్కొన్న అన్ని సౌకర్యాలు బిల్డర్, కొనుగోలుదారు మధ్య ఒప్పందంలో ఉండాలి. వారు చెప్పిన సౌకర్యాలు కల్పించనందుకు మీరు వారిని బాధ్యులను చేయవచ్చు. రెరా చట్టంలోని సెక్షన్ 14(3) ప్రకారం ఏదైనా నిర్మాణ లోపం అంటే 5 సంవత్సరాలలోపు నిర్మాణం, పనితనం, నాణ్యత లేదా సేవలో ఏదైనా లోపం ఉంటే బిల్డర్ దానిని సరిదిద్దాలి. బిల్డర్ ఎలాంటి ఛార్జీ లేకుండా 30 రోజుల్లోగా ఈ సమస్యలను సరిచేయాలి. తరువాత సైతం లోపం ఉంటే గృహ కొనుగోలుదారుకు పరిహారం కోరే హక్కు ఉంటుంది.
రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భంలో సంబంధిత రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు. రెరాతో పాటు వినియోగదారుల కోర్టులో కూడా ఫిర్యాదులు దాఖలు చేసుకోవచ్చు. రెరాలో ఫిర్యాదులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు. రెరా వెబ్‌సైట్‌లో ఫిర్యాదును ఆన్‌లైన్‌లో దాఖలు చేయడం మీకు ఈజీ అవుతుంది. వద్దు అనుకుంటే.. నేరుగా రెరా కార్యాలయాన్ని సందర్శించి ఫారం Mని సమర్పించొచ్చు. దీని ద్వారా కూడా మీ సమస్యను ఫిర్యాదు రూపంలో ఇవ్వవచ్చు.
టాపిక్