ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్ల గురించి అందరూ చూసి షాక్ అయ్యారు. జియో మీద అయితే చాలా ట్రోల్స్ నడిచాయి. అనంత్ అంబానీ పెళ్లి ఖర్చులు జనాల మీద తీస్తున్నారని విమర్శలు వచ్చాయి. అయితే చాలా మంది రెండు సిమ్‌లు వాడుతుంటారు. అందులో ఒకదానికి రీఛార్జ్ చేసుకుని, మరో దానికి చేయకుంటే సిమ్ పని చేయదు. ఎవరు కాల్ చేసినా కలవదు. రెండు సిమ్‌లు కూడా యాక్టివ్‌గా ఉండాలనుకునేవారు తక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.
ఈ ప్లాన్లన్నీ రూ.200 లోపే ఉంటాయి. జియో తన చౌకైన ప్లాన్ ధరను ఎయిర్టెల్, విఐ కంటే రూ .10 తక్కువకు నిర్ణయించింది. దీనితో జియో కస్టమర్లు ఆ ప్లాన్ వేసుకోవచ్చు. మీ రెండో సిమ్ కూడా యాక్టివ్‌గా ఉంచుకునేందుకు మీరు ఎంచుకోవాల్సిన ప్లాన్స్, ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకోండి..
ఎయిర్టెల్ రూ .199 ప్లాన్ 2 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఎయిర్టెల్ ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎయిర్టెల్ ఈ ప్లాన్ ధర రోజువారీ ప్రకారం రూ .7.10గా ఉంటుంది. ఇందులో 300 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. అయితే ఈ ప్యాక్ ధర ఎక్కువ అనుకునేవారు.. రూ.155 ప్లాన్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది 24 రోజులే. 1జీబీ డేటా మాత్రమే వస్తుంది.
జియో ఈ సరసమైన ప్లాన్ రూ.189కు 28 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ లో 5జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్కులకో అపరిమిత కాలింగ్, నెలకు 1000 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే జియో టీవీతో పాటు జియో సినిమాకి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ కోసం జియో యూజర్లు రోజుకు రూ.6.75 చెల్లించాల్సి ఉంటుంది.
వొడాఫోన్ ఐడియా 28 రోజుల వాలిడిటీతో వస్తున్న ప్లాన్ ధర రూ.199. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. అదే సమయంలో ప్రతిరోజూ వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు రూ .7.10గా పడుతుంది. అంటే 199లో రోజువారీ చొప్పున రూ.7.10గా పడుతుంది.