Micro Electric Car : ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారు ధర చాలా తక్కువ.. 200 కి.మీ రేంజ్, 2 సీటర్ మాత్రమే!
Small Electric Car : ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి. ఓ బుజ్జి ఎలక్ట్రిక్ కారు కూడా మార్కెట్‌లో ఉంది. ఇది 2 సీటర్ మాత్రమే.. కానీ మంచి మైలేజీ ఇస్తుంది.
కొన్నేళ్లుగా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఫ్యాన్స్ పెరుగుతున్నాయి. టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్‌తో సహా ప్రధాన వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ముంబైకి చెందిన ఈవీ స్టార్టప్ పీఎంవీ ఎలక్ట్రిక్ 2022లో EaS-E పేరుతో సరికొత్త మైక్రో ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఇది తక్కువ ధరతో అనేక ఫీచర్లతో వస్తుంది.
కొత్త పీఎంవీ EaS-E ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్‌లు ఇప్పటికీ తెరిచి ఉన్నాయి. ఆసక్తిగల కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి రూ.2,000 ముందస్తుగా చెల్లించి కొత్త పీఎంవీ ఈఏఎస్-ఈ ఈవీని బుక్ చేసుకోవచ్చు. ఈ కారును ప్రవేశపెట్టి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది. అయితే వివిధ కారణాల వల్ల కంపెనీ ఇప్పటి వరకు ఈ ఈవీని పంపిణీని ప్రారంభించలేదు.
గతంలో ఈ కారు గురించి పీఎంవీ ఎలక్ట్రిక్ కంపెనీ అధినేత మాట్లాడారు. కొత్త పీఎంవీ ఈఏఎస్-ఈ ఈవీ మైక్రో కారు డెలివరీ 2023 మూడో త్రైమాసికంలో ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే ఇప్పటికీ అది ప్రారంభం కాలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది (2025) నుంచి దేశీయ కస్టమర్ల ఇళ్లలోకి కొత్త కారు ప్రవేశిస్తుందని తెలుస్తోంది.
పీఎంవీ ఈఏఎస్-ఈ మైక్రో ఎలక్ట్రిక్ కారు ధర రూ. 4.79 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించారు. ఇది ప్రీమియం బైక్ కంటే తక్కువ ధర అని చెప్పవచ్చు. ఈ కారు రాయల్ బీజ్, డీప్ గ్రీన్, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ కారులో 10 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంది. వేరియంట్‌ను బట్టి 120, 160, 200 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది 13.41 బిహెచ్‌పి హార్స్ పవర్, 50 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. పీఎంవీ ఈఏఎస్-ఈ మైక్రో ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ప్యాక్ 15A సాకెట్‌ని ఉపయోగించి 3 నుండి 4 గంటలలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇది కేవలం 5 సెకన్లలో 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 70 కేఎంపీహెచ్ వేగాన్ని కలిగి ఉంటుంది.
ఈ కారులో ఎల్‌సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డోర్ లాక్/అన్‌లాక్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, సీట్‌బెల్ట్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా కూడా ఉన్నాయి. ఇది 2 సీటర్ మాత్రమే. ఈ కారు కావాలి అనుకున్నవారు ఇప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు. 2025లో డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.