DAP subsidy: రైతులకు శుభవార్త; డీఏపీ పై అదనపు సబ్సీడీ పొడిగింపు; 50 కేజీల బస్తా ధర..
DAP subsidy: ప్రధాన ఎరువుల్లో ఒకటైన డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP)పై ఇస్తున్న అదనపు సబ్సీడీని పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై రూ. 3,850 కోట్ల భారం పడుతుంది. నిజానికి ఈ అదనపు సబ్సీడీ గడువు 2024 డిసెంబర్ 31 తో ముగుస్తుంది.
DAP subsidy: డీఏపీ పై అదనపు సబ్సీడీ ని డిసెంబర్ 31, 2024 తరువాత కూడా కొనసాగించాలని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. మార్కెట్లో ఈ కీలక ఎరువు ధరను నియంత్రించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సబ్సీడీతో మార్కెట్లో డీఏపీ 50 కిలోల బస్తా రూ.1,350 కి లభిస్తుంది. ఈ సబ్సీడీ వల్ల ఖజానాపై రూ .3,850 కోట్ల వరకు భారం పడుతుంది.
గత సంవత్సరంలో..
ధరలను అదుపులో ఉంచడానికి రూ.2,625 కోట్ల ఆర్థిక భారంతో 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు టన్నుకు రూ.3,500 చొప్పున డీఏపీ (di-ammonium phosphate)పై వన్ టైమ్ స్పెషల్ ప్యాకేజీని కేంద్రం గత ఏడాది ప్రకటించింది. ఈ ప్యాకేజీ యూరియాయేతర పోషకాలపై ప్రభుత్వం నిర్ణయించిన పోషక ఆధారిత సబ్సిడీ (NBS) కంటే ఎక్కువగా ఉంది. 2025 జనవరి 1 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డీఏపీపై టన్నుకు రూ.3,500 చొప్పున వన్ టైమ్ స్పెషల్ ప్యాకేజీని పొడిగించాలన్న ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రైతుల కోసం..
రైతులకు అందుబాటులో డీఏపీ ధర ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం అధికారిక ప్రకటనలో తెలిపింది. రైతులకు సరసమైన ధరలో డీఏపీ ఎరువులు (fertiliser) సజావుగా అందేలా డీఏపీపై ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించామని, ఇది ఎన్బీఎస్ (పోషక ఆధారిత సబ్సిడీ)కు మించి ఉంటుందని తెలిపారు. ఈ సబ్సీడీతో రైతులకు బస్తాకు రూ.1,350 చొప్పున డీఏపీ లభిస్తుందని, అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేబినెట్ భేటీ అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
ఇతర ఎరువులు కూడా..
భౌగోళిక రాజకీయ ఆందోళనల కారణంగా ప్రపంచ మార్కెట్లో డీఏపీ ధరలు అస్థిరంగా ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎరువుల తయారీదారులు/ దిగుమతిదారుల ద్వారా కేంద్రం రైతులకు 28 గ్రేడ్ల పీ అండ్ కే (ఫాస్ఫేటిక్, పొటాషియం) ఎరువులను సబ్సిడీపై అందిస్తుంది. ఏప్రిల్ 1, 2010 నుంచి పీ అండ్ కే ఎరువులపై సబ్సిడీ ఎన్బీఎస్ స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP) ఎరువుల ధరలను యథాతథంగా ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ ఉపశమనం కల్పించింది.
గత ప్రభుత్వం కంటే..
భౌగోళిక రాజకీయ పరిమితులు మరియు ప్రపంచ మార్కెట్ పరిస్థితులలో అస్థిరత ఉన్నప్పటికీ, 2024-25 ఖరీఫ్ మరియు రబీలో రైతులకు సరసమైన ధరలకు డీఏపీ లభ్యతను నిర్ధారించడం ద్వారా రైతు స్నేహపూర్వక విధానం కోసం తన నిబద్ధతను నిలబెట్టుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మోదీ ప్రభుత్వం 2014-24 కాలంలో రూ .11.9 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీని అందించింది. ఇది 2004-14 కాలానికి అందించిన రూ .5.5 లక్షల కోట్ల సబ్సిడీ కి రెట్టింపు.