Byju Raveendran: ‘‘జూలై నెల జీతాలు చెల్లించలేకపోయాం. ఎందుకంటే..’’ - ఉద్యోగులకు బైజూస్ రవీంద్రన్ లేఖ
జూలై నెల వేతనాలకు చెల్లించలేకపోయామని, అందుకు కారణాలు ఇవేనని వివరిస్తూ, ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ సంస్థ ఉద్యోగులకు ఈ మెయిల్ చేశారు. చట్టపరమైన అడ్డంకుల వల్ల కంపెనీ పునరుద్ధరణ మరింత ఆలస్యమవుతోందని బైజూ రవీంద్రన్ ఉద్యోగులకు పంపిన ఆ ఈ మెయిల్ లో పేర్కొన్నారు.
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నిర్ణయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టే కారణంగా కంపెనీ తన బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయలేకపోయిందని, అందువల్లనే ఉద్యోగులకు జూలై వేతనాన్ని చెల్లించలేదని బైజూస్ యజమాని బైజూ రవీంద్రన్ తన ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో వెల్లడించారు.
బీసీసీఐ తో సెటిల్మెంట్..
బీసీసీఐతో రూ.158.9 కోట్ల బకాయిల సెటిల్మెంట్ కు ఆమోదం తెలపడంతో పాటు బైజూస్ దివాళా ప్రక్రియను ఆగస్టు 2న ఎన్సీఎల్ఏటీ రద్దు చేసింది. అయితే అమెరికాకు చెందిన మరో రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ పిటిషన్ కారణంగా ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆగస్టు 14న స్టే విధించింది. దాంతో, బైజూస్ కి తమ బ్యాంక్ ఖాతాల పునరుద్ధరణ సాధ్యం కాలేదు.
అందువల్లనే వేతనాలు లేట్
అందువల్లనే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేకపోయానని బైజూస్ రవీంద్రన్ తన ఉద్యోగులకు వివరించాడు. "నేను మీకు, అలాగే నాకు కూడా అత్యంత ఆందోళన కలిగించే విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. ఉద్యోగులకు 2024 జూలై నెల జీతం ఇంకా జమ కాలేదు. మన సంస్థ ఇటీవల తీవ్రమైన సవాలును ఎదుర్కొంది. బీసీసీఐ (BCCI)తో వివాదం కారణంగా సంస్థ దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. ఎన్సీఎల్ఏటీ మనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సంస్థ ఆర్థిక పరిస్థితిపై తిరిగి నియంత్రణ సాధ్యమవుతుందనుకున్నాను. అయితే, ఎన్సీఎల్ఏటీ నిర్ణయంపై సుప్రీంకోర్టు (Supreme court) తాత్కాలిక స్టే విధించింది. దాంతో, కంపెనీ బ్యాంక్ ఖాతాల యాక్సెస్ నిలిచిపోయింది’’ అని రవీంద్రన్ వివరించారు.
ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు
సంస్థకు రుణాలిచ్చిన కొన్ని విదేశీ సంస్థలు కంపెనీకి వ్యతిరేకంగా, ఎన్సీఎల్ఏటీ తీర్పును సవాలు చేస్తూ, సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారని ఆయన చెప్పారు. గత చాలా నెలలుగా జీతాలు చెల్లించడానికి అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకోలేకపోతున్నామని రవీంద్రన్ తెలిపారు. ‘‘నేను మీకు హామీ ఇస్తున్నాను. మేము సంస్థ ఆర్థిక పరిస్థితిపై నియంత్రణను తిరిగి పొందినప్పుడు, మీ వేతనాలను వెంటనే చెల్లిస్తాము. అవసరమైతే, మరిన్ని రుణాలను తీసుకుని అయినా మీ వేతనాలు చెల్లిస్తాం. ఇది కేవలం వాగ్దానం మాత్రమే కాదు. ఇది మా నిబద్ధత. మనం మళ్లీ నిలదొక్కుకోవడానికి సపోర్ట్ చేయడానికి మనకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారు’’ అని రవీంద్రన్ వెల్లడించారు.