BYD Sealion 7 : మార్కెట్‌లోకి రాబోతున్న బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 567 కి.మీ రేంజ్
BYD Sealion 7 : భారత మార్కెట్‌లో మరో కొత్త ఎలక్ట్రిక్ కారు త్వరలో రాబోతుంది. అదే బీవైడీ సీలియన్ 7. ఈ కారుకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం..

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ ఉంది. భారతదేశం, విదేశాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్లు ఇక్కడ ప్రవేశిస్తున్నాయి. మీరు లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకోసం బీవైడీ సీలియన్ 7 దేశీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు ఫిబ్రవరి 17న లాంచ్ అవుతుంది. దీని బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 70 వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించి రాబోయే ఈవీని బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్, స్పెసిఫికేషన్లను చూద్దాం..
రేంజ్ వివరాలు
బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్లలో అందిస్తారు. ఈ EV 82.5 kWh శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 567 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ పవర్‌ట్రెయిన్ 308బీహెచ్‌పీ శక్తిని, 380ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఆర్‌డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
11 ఎయిర్ బ్యాగ్స్
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో పెద్ద పనోరమిక్ గ్లాస్ రూఫ్, వినోదం కోసం 15.6-అంగుళాల తిరిగే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, భద్రత కోసం ఏడీఏఎస్, 11 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త టెక్నాలజీ
బీవైడీ సీలియన్ 7 ఇంటెలిజెంట్ టార్క్ యాక్టివ్ కంట్రోల్ (iTAC), వినూత్నమైన సీటీబీ (సెల్ టు బాడీ) ఆర్కిటెక్చర్ వంటి అనేక అధునాతన సాంకేతికతలతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV లో 19-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. దీనిని భారత మార్కెట్లో దాదాపు రూ.40-45 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేయవచ్చని అంచనా.