BYD Sealion 7 : బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. రేంజ్ మామూలుగా ఉండదు!
BYD Sealion 7 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీవైడీ ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లోకి వచ్చింది. ఎన్నో ఫీచర్లతో ఈ ఈవీ ఆకట్టుకుంటోంది. మంచి రేంజ్‌ని అందిస్తుంది. ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ సీలియన్ 7ను విడుదల చేసింది. కంపెనీ జనవరి 18, 2025న జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును ఆవిష్కరించిన విషయం తెలిసిందే. బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెలలోనే 1000కి పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్‌లను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.
ధరలు
బీవైడీ సీలియన్ 7 ప్రీమియం వేరియంట్ 82.56kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 48,90,000(ఎక్స్ షోరూమ్). బీవైడీ సీలియన్ 7 పెర్ఫార్మెన్స్ వేరియంట్ కూడా 82.56kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 54,90,000(ఎక్స్-షోరూమ్). కంపెనీ అత్యాధునిక ఇంటెలిజెంట్ టార్క్ అడాప్టేషన్ కంట్రోల్(iTAC), CTB (సెల్ టు బాడీ) టెక్నాలజీని ఇందులో ఉపయోగించింది. ఎక్కువ క్యాబిన్ స్థలం, మెరుగైన నిర్వహణతో ఈ కారు వస్తుంది.
రేంజ్ వివరాలు
పెర్ఫార్మెన్స్ వేరియంట్ 4.5 సెకన్లలో 100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. ప్రీమియం వేరియంట్ 6.7 సెకన్లలో 100 కేఎంపీహెచ్ స్పీడ్ అందుకోగలదు. పెర్ఫార్మెన్స్ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 542 కి.మీ.లు ప్రయాణించగలదని, ప్రీమియం వేరియంట్ పూర్తిగా ఛార్జ్ చేస్తే 567 కిలో మీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఫీచర్లు
ఈ బ్యాటరీ LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) టెక్నాలజీ కలిగి ఉంది. పెర్ఫార్మెన్స్ వేరియంట్ 390 kW పవర్, 690 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రీమియం వేరియంట్ 230 kW పవర్, 380 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే ఇంటీరియర్ 15.6-అంగుళాల తిరిగే టచ్‌స్క్రీన్, ప్రీమియం క్విల్టెడ్ నప్పా లెదర్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ ఆప్షన్స్‌తో రూపొందించారు.
ఎలక్ట్రిక్ సన్‌షేడ్‌తో కూడిన పనోరమిక్ గ్లాస్ రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే వస్తుంది. ఇది 12 డైనాడియో స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, 50 W వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఫ్యూచరిస్టిక్ డైనమిక్ వాటర్ డ్రాప్ టెయిల్ లాంప్స్, స్టాండర్డ్‌గా 11 ఎయిర్‌బ్యాగులు, డ్రైవర్ ఫిట్‌నెస్ మానిటరింగ్ వంటి ఇతర ఫీచర్లను కూడా పొందింది ఈ కారు.
బీవైడీ సీలియన్ 7 ఇప్పటికే 1000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. ఈ కారు డెలివరీ 2025 మార్చి మధ్య నుంచి మెుదలవుతుంది.
సంబంధిత కథనం