Budget 2025: ఈ బడ్జెట్ లో పాత ఆదాయ పన్ను విధానానికి గుడ్ బై చెబుతారా?.. నిపుణులు ఏమంటున్నారు?
Budget 2025: బడ్జెట్ 2025 గడువు సమీపిస్తుండటంతో పాత ఆదాయ పన్ను విధానాన్ని రద్దు చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. భారతదేశంలో పన్ను విధానాన్ని మరింత సరళీకృతం చేయడానికి కేంద్రం పాత పన్ను విధానాన్ని రద్దు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Budget 2025: బడ్జెట్ 2025కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కేంద్ర బడ్జెట్ 2025 ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి గడువు సమీపిస్తున్నందున.. ఆ బడ్జెట్ లో ప్రభుత్వం తీసుకురాబోయే కీలక నిర్ణయాలపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మునుపటి ఆదాయపు పన్ను వ్యవస్థను పూర్తిగా రద్దు చేయనున్నారన్నది ఆ ఊహాగానాల్లో ప్రధానమైనదిగా ఉంది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం, సరళీకృత, పారదర్శక విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకురావడంతో, పాత పన్ను విధానాన్ని తొలగిస్తారని తొలగిపోవచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

కొత్త పన్ను విధానానికి ప్రభుత్వ ప్రోత్సాహం
కొత్త పన్ను విధానం పట్ల ప్రభుత్వ పక్షపాత వైఖరి, దాన్ని ఎంచుకునే వారి సంఖ్య పెరగడం, కొత్త విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి పాత విధానంలో వివిధ మినహాయింపుల పరిమితులను అప్డేట్ చేయకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, బడ్జెట్ 2025 (union budget 2025) లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆర్థిక మంత్రి నిర్ణయించినా ఆశ్చర్యపోనవసరం లేదని ముంబైకి చెందిన ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ నిపుణుడు బల్వంత్ జైన్ అన్నారు. ‘‘పన్ను చెల్లింపుదారులు తమ వాస్తవ ఆదాయాన్ని నివేదించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కొత్త పన్ను విధానానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి, అటువంటి చర్య త్వరలోనే జరగవచ్చు’’ అని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ 2025 లో భారత పన్ను వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని కేబీపీ గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ కన్సాల్ అన్నారు.
రెండు పన్ను విధానాలు
ప్రస్తుతం, భారతదేశం రెండు విభిన్న పన్ను విధానాలతో పనిచేస్తుంది. ఒకటి, వివిధ మినహాయింపులను అనుమతించే పాత పన్ను విధానం కాగా, మరొకటి తక్కువ బేస్ రేట్లను అందిస్తూ, ఆ మినహాయింపులను తొలగించే కొత్త పన్ను విధానం. కొత్త బేస్ రేట్లతో కొత్త పన్ను విధానం ద్వారా క్రమబద్ధీకరించిన పన్ను వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇందులో భాగంగా, పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగిస్తుందా? అనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ, సంకేతాలు కానీ రాలేదు. ఈ విషయంపై ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ (budget 2025) ప్రవేశపెట్టిన సమయంలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పాత పన్ను విధానం వర్సెస్ కొత్త పన్ను విధానం: కీలక వ్యత్యాసాలు
- కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు, పాత విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను రాయితీ లభిస్తుంది.
- కొత్త నిబంధన ప్రకారం వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000 కాగా, పాత పన్ను విధానంలో ఇది రూ.50,000 గా ఉంది.
- 80సీ, 80డీ, హెచ్ఆర్ఏ సహా వివిధ సెక్షన్ల కింద లభించే, పాత పన్ను విధానానికి మాత్రమే పరిమితమైన మినహాయింపులు కొత్త పన్ను విధానంలో లేవు.
- పార్లమెంట్ (parliament) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగియనున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి. హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.
టాపిక్