Budget 2025 : ఈసారైనా 8వ వేతన సంఘం ఆశించవచ్చా? ఉద్యోగులకు తీపి కబురు చెబుతారా?
Budget 2025 : ఏడో వేతన సంఘం అమల్లోకి వచ్చి దశాబ్దం అవుతుంది. అయితే 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఉద్యోగుల నుంచి భారీ డిమాండ్లు ఉన్నాయి. బడ్జెట్ సందర్భంగా దీని గురించి ఏదైనా ప్రకటన ఉంటుందా? అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యూనియన్ బడ్జెట్ 2025కి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌పై అందరికీ ఆశలు అతిగానే ఉన్నాయి. అదే సమయంలో 8వ వేతన సంఘంపై చర్చలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రీ-బడ్జెట్ సమావేశంలో 8వ వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. గత బడ్జెట్‌లోనూ కొత్త వేతన సంఘం డిమాండ్‌ను ఉద్యోగుల సంఘాలు లేవనెత్తాయి.
అయితే గత బడ్జెట్‌లో 8వ వేతన సంఘంపై డిమాండ్లు చేసినా ఎలాంటి ప్రకటన చేయలేదు. 8వ వేతన సంఘాన్ని త్వరలో ఏర్పాటు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత నెలలో పేర్కొంది. నిన్నటి సమావేశం ద్వారా ప్రభుత్వం ఈ 2025 బడ్జెట్‌లో కొత్త పే కమిషన్‌ను ప్రకటిస్తుందా? అనే విషయంపై కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి విధానాలు, కొత్త అప్‌డేట్‌లు చెబుతున్నా అది రాబోయే బడ్జెట్ 2025 సంబంధితంగా ఉంటుంది. ఈసారి కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు 8వ వేతన సంఘాన్ని సత్వరమే ఏర్పాటు చేయాలని కోరారు. ఇది అమల్లోకి వస్తుందా లేదా అన్నది ఫిబ్రవరి 1న జరిగే బడ్జెట్ సమర్పణలో తేలనుంది. అప్పటివరకు ఆగితే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
ఏడో వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పాటైంది. ప్రస్తుతం 10 సంవత్సరాలు గడిచాయి. ఈసారి కూడా కొత్త పే కమిషన్ రాకపోతే ఇతరత్రా సమస్యలకు దారి తీయవచ్చు. 8వ వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డిసెంబరు 12న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కూడా కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
ఎనిమిదో వేతన సంఘం త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదు. అయితే జీతాల పెంపుపై ఉద్యోగుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86కి ప్రభుత్వం ఆమోదం తెలిపితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెరుగుతుంది. ఈ సమాచారం అధికారికంగా విడుదల కాలేదు.
ద్రవ్యోల్బణం పెరిగినందున ఉద్యోగులందరూ వేతనాల పెంపుదల కోరుకుంటున్నారు. అయితే అది ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తుందనే కొందరి వాదన. 10 ఏళ్ల తర్వాత ఈసారి బడ్జెట్ సందర్భంగా కొత్త వేతన సంఘంపై ఆశలతో ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. 8వ వేతన సంఘం అమలైతే జీతం, పెన్షన్, డీఏ పెరుగుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
8వ వేతన సంఘం గురించి ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఆలోచన లేదన్నట్టుగానే గతంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే 8వ వేతన సంఘం స్థానంలో కొత్త విధానంపై కసరత్తు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల పనితీరు, సామర్థ్యం, ద్రవ్యోల్బణం ఆధారంగా జీతభత్యాలు పెంచేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. దీని ప్రకారం ప్రైవేట్ సంస్థలు ఇచ్చిన మాదిరిగానే ఏడాదికోసారి అప్రైజల్ విధానం ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు.