Budget 2025 income tax : 12లక్షల వరకు ఆదాయపు పన్ను ‘0’- మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్..
Budget 2025 income tax : మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట! రూ. 12లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును ఇస్తున్నట్టు 'బడ్జెట్ 2025'లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాదు, కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకొస్తున్నట్టు వివరించారు.
భారీ పన్నులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు "బడ్జెట్ 2025"లో భారీ శుభవార్తను ఇచ్చారు కేంద్రం ఆర్థిక నిర్మలా సీతారామన్. మధ్యతరగతి ప్రజలకు మరింత ఆర్థిక బలాన్ని ఇచ్చేందుకు రూ. 12లక్షల జీతం వరకు ఆదాయపు పన్నును మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న శ్లాబు రేట్లను మారుస్తున్నట్టు వెల్లడించారు.

ఆదాయపు పన్ను బడ్జెట్ 2025..
“దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి బలాన్ని అందిస్తుంది. వారి కృషికి గుర్తింపుగా ఎప్పటికప్పుడు పన్ను భారం తగ్గిస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదని బడ్జెట్ 2025లో ప్రకటించడం సంతోషంగా ఉంది,” అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అంతేకాదు.. రూ. 75వేల స్టాండర్డ్ డిడక్షన్ ఉన్న వేతన జీవులకు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మల సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో స్పష్టం చేశారు.
కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబుల సవరణ..
ఆదాయం రూ. 4,00,000: 0 ఆదాయపు పన్ను
రూ. 4,00,001 నుంచి రూ. 8,00,000: 5% పన్ను
రూ. 8,00,001 నుంచి రూ. 12,00,000: 10% పన్ను
రూ. 12,00,001 నుంచి రూ. 16,00,000: 15% పన్ను
రూ. 16,00,001 నుంచి రూ. 20,00,000: 20% పన్ను
రూ. 20,00,001 నుంచి రూ. 24,00,000: 25% పన్ను
రూ. 24,00,000 అంతకన్నా ఎక్కువ: 30% పన్ను
పాత పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబులు..
నూతన పన్ను విధానాన్ని ఫాలో అవ్వాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పాత పన్ను విధానంతోనూ కొనసాగవచ్చు. పాత పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబులు ఇలా..
ఆదాయం రూ. 2,50,000: నో ట్యాక్స్
రూ. 2,50,001 నుంచి రూ. 5,00,000: 5% పన్ను
రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000: 20% పన్ను
రూ. 10,00,000 అంతకన్నా ఎక్కువ: 30% పన్ను
సంతోషంలో మధ్యతరగతి ప్రజలు..!
రూ. 12లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు అని నిర్మల ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. అందరు ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
“బడ్జెట్ 2025- ఇది దేశ మధ్యతరగతి ప్రజలకు ఒక గేమ్ ఛేంజర్ లాంటిది,” అని ఒకరు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. “వావ్ అసలు ఊహించలేదు,” అని ఇంకొకరు అన్నారు.
కేంద్రం నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించినట్టు అయ్యింది. తాజా చర్యతో ప్రజల సేవింగ్స్, స్పెండింగ్ పవర్ పెరుగుతుంది.
కొత్త ఆదాయపు పన్ను బిల్లు..
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడతామని నిర్మల ప్రకటించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సరళతరం చేయడానికి, సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తుందని వివరించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు పేజీల సంఖ్యను 60శాతం తగ్గించడానికి ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961ను ఆరు నెలల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన జులై బడ్జెట్లోనే ప్రకటించారు.
సంబంధిత కథనం