Budget 2025 New Scheme : రైతులకు కేంద్రం కొత్త స్కీమ్.. మరోవైపు జాతీయ పత్తి కమిషన్‌పై ప్రకటన
Budget 2025 New Scheme : బడ్జెట్ 2025లో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు శుభవార్త చెప్పారు. ధన్ ధాన్య యోజన పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టారు. 2025-26 బడ్జెట్.. విక్షిత్ భారత్, జీరో పావర్టీ లక్ష్యమని పేర్కొన్నారు. బడ్జెట్‌లో యువత, రైతులు, మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు నిర్మలా సీతారామన్. రైతుల కోసం కొత్త స్కీమ్ తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు.

100 జిల్లాల్లో అమలు
పీఎం ధన్ ధాన్య యోజన పథకాన్ని 100 జిల్లాల్లో అమలు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ పథకంలో భాగంగానే పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రణాళిక ఉంటుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తి, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కొత్త స్కీమ్ ద్వారా 1.7 కోట్ల రైతులకు లబ్ధి చేకూరనుందని ఆర్థిక మంత్రి అన్నారు. రాష్ట్రాలతో కలిసి దీన్ని ప్రారంభించి, అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు కిసాన్ క్రెడిట్ క్రెడిట్ లిమిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు బీహార్ మఖానా బోర్డు ఏర్పాటును కూడా ప్రకటించారు.
రైతులపై దృష్టి
'మేక్ ఇన్ ఇండియా, ఎంప్లాయ్ మెంట్ అండ్ ఇన్నోవేషన్, ఎనర్జీ సప్లై, స్పోర్ట్స్ డెవలప్ మెంట్ వంటివి మన అభివృద్ధి ప్రయాణంలో భాగం. దీనికి ఇంధనం.. సంస్కరణలు. రాష్ట్రాల భాగస్వామ్యంతో గ్రామీణ సౌభాగ్యాన్ని పెంపొందించడం, అనుసరణ చేపట్టడం జరుగుతుంది. యువ రైతులు, గ్రామీణ మహిళలు, రైతులు, చిన్నకారు రైతులపై దృష్టి సారించనున్నాం.' అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
పప్పు దినుసుల్లో స్వయం సమృద్ధి
ఈ కొత్త పథకంలో మొదటి దశలో తక్కువ ఉత్పాదకతతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న 100 వ్యవసాయ జిల్లాలను చేర్చనున్నారు. వంటనూనెల స్వయం సమృద్ధి కోసం ప్రభుత్వం నేషనల్ ఆయిల్ మిషన్ ను అమలు చేస్తోంది. పదేళ్ల క్రితం సమిష్టి కృషి చేసి పప్పు దినుసుల్లో స్వయం సమృద్ధి సాధించామని, అప్పటి నుండి ఆదాయం పెరిగిందని, మెరుగైన ఆర్థిక సామర్థ్యం ఉందన్నారు కేంద్రమంత్రి.
జాతీయ పత్తి కమిషన్
అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించారు నిర్మలా సీతారామన్. 2024 జూలై నుంచి వందకుపైగా కొత్త ఉత్పత్తి వంగడాలు విడుదల చేసినట్టుగా చెప్పారు. పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో కమిషన్ ఉంటుందని చెప్పారు. పత్తి విత్తనాలు, ఉత్పత్తి పెంచేలా ఈ కమిషన్ పని చేయనుంది. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి కొత్త కర్మాగారాలు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు.