Budget 2025 : బడ్జెట్లో పేదలు, మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్! మోదీ మాటలకు అర్థం ఇదేనా..?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ దఫా బడ్జెట్లో పేదలు, మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ అందుతుందని ఆయన మాటలు సంకేతాన్ని ఇచ్చాయి.
బడ్జెట్ 2025 కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ అందే విధంగా ఈ దఫా బడ్జెట్‌ని కేంద్రం రూపొందించినట్టు మోదీ సంకేతాలిచ్చారు.

పేదలు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో గుడ్ న్యూస్..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాగా సమావేశాలకు ముందు మీడియా ముందు ప్రధాని మాట్లాడారు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవిని ప్రస్తావిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలకు మంచి జరగాలని అభిప్రాపడ్డారు.
“మన దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కటాక్షం కొనసాగాలని ప్రార్థిస్తున్నాను. ప్రజాస్వామ్య దేశంగా భారత్ 75ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వంగా ఉంది. అంతర్జాతీయంగానూ ఇండియా బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది,” అని మోదీ వ్యాఖ్యానించారు.
"నా మూడో టర్మ్‌లో ఇదే తొలి పూర్తి బడ్జెట్. 2047 నాటికి, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి, ఈ దేశం తన వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకుంటుంది. ఈ బడ్జెట్ దేశానికి కొత్త శక్తిని, ఆశను ఇస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను," అని మోదీ చెప్పుకొచ్చారు.
ట్యాక్స్ రిలీఫ్ దక్కేనా..?
దేశంలో గత కొన్నేళ్లుగా ఆదాయపు పన్నుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీతో పాటు ఆదాయపు పన్ను రేట్లతో ప్రజలపై విపరీతంగా భారం పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025లో ఆదాయపు పన్ను రేట్లను తగ్గిస్తారని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవిని ప్రస్తావిస్తూ మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆశలను రేకెత్తించాయి.
2020 నుంచి భారతదేశంలో ఆదాయపు పన్ను శ్లాబులు పెద్దగా మారలేదు. కాగా ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో శ్లాబులను సవరించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
ఎల్పీజీ సిలిండర్ సబ్సీడీ పునరుద్ధణ వంటి ప్రకటనలు ఈ బడ్జెట్లో ఉంటాయా? మోదీ మాటలకు అర్థం ఇదేనా? అని ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ మాత్రమే కాదు దాదాపు అన్ని అధికార, విపక్ష పార్టీలు ప్రతి ఎన్నికల్లోనూ ఇదే విషయంపై హామీల వర్షం కురిపిస్తూ ఉంటాయి. లేక ఇప్పటికే అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల (పీఎం కిసాన్, పఎంఏవై, జల్ జీవన్) విస్తరణను ఈసారి ప్రకటిస్తారా? అన్నది చూడాలి.
సంబంధిత కథనం