Budget 2025 : ఈసారి 2025 బడ్జెట్‌లో విద్యా రంగానికి ప్రత్యేక ప్రకటనలు ఉంటాయా?
Budget 2025 : మరికొన్ని రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. 2025లో విద్యారంగానికి ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేదానిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఏవైనా కొత్త స్కీమ్స్ తీసుకువచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఏ ప్రభుత్వమైనా బడ్జెట్‌లో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని విద్యా పథకాలు మంచి పురోగతిలో ఉన్నాయి. బడ్జెట్ 2025 రోజు దగ్గరకి వస్తున్నందున ఈసారి బడ్జెట్‌లో విద్యా రంగానికి ప్రత్యేకించి ఏం కేటాయించబోతున్నారో అనే విషయం ఆసక్తిగా ఉంది.
గత కొన్నేళ్లుగా విద్యారంగానికి సంబంధించి బడ్జెట్‌లో నిరంతర పెరుగుదల ఉంది. 2024లో రూ.121117.77 కోట్లు, 2023లో రూ.112899.47 కోట్లుగా ఉంది. పాఠశాల విద్యకు 2024లో రూ.73008 కోట్లు, అదే 2023లో రూ.68804.85 కోట్లు, 2022లో రూ.63449.37 కోట్లు కేటాయింపులు ఉన్నాయి. ఈసారి కూడా విద్యారంగానికి బడ్జెట్‌ను పెంచే అవకాశం ఉంది.
రాబోయే బడ్జెట్ 2025 భారతదేశ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అవకాశమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చడానికి ఉన్నత విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలు, పరిశోధన, సాంకేతికతలో పెట్టుబడి అవసరం. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు అధిక నిధులు, పరిశ్రమలతో సహకారం, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడంలాంటివి చేయాలి. ఇది విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని తగ్గించగలవు.
విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నూతన జాతీయ విద్యా విధానం-2020 తీసుకువచ్చింది. భవిష్యత్తులో భారత యువత ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తయారు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు రుణాల కోసం ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర బడ్జెట్ 2024 కింద పీఎం విద్యాలక్ష్మి యోజన ప్రారంభించింది. ఈసారి కూడా మరో పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.
బడ్జెట్‌లో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కోసం కేటాయింపులు ఎక్కువగా ఉంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాఠశాల, కళాశాల సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా చేయాలి. ఇప్పటికే ఉన్న నిర్మాణాలు ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో స్మార్ట్ బోర్డ్‌లతో తరగతి గదులను అప్‌గ్రేడ్ చేయడం, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, వినూత్న అభ్యాస సాధనాలు ఉండేలా చూడాలనే అభిప్రాయం ఉంది. 2025 బడ్జెట్‌లో విద్యా రంగానికి ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు చేస్తారో చూడాలి.
టాపిక్