Budget 2025 : పన్ను చెల్లించే మహిళలు బడ్జెట్‌లో ఏం ఆశించవచ్చు? ఏదైనా బంపర్ గిఫ్ట్ ఉంటుందా?
Budget 2025 : యూనియన్ బడ్జెట్ దగ్గరకు వస్తున్న కొద్దీ కేటాయింపులపై అంచనాలు పెరుగుతాయి. పన్ను చెల్లించే మహిళలు ఎలాంటివి ఆశించవచ్చు?
బడ్జెట్ 2025-26 దగ్గరకు వస్తుంది. పరిశ్రమల ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు చాలా ఎదురుచూపులు ఉంటాయి. కేంద్ర బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రాబడి, వ్యయాలను వివరిస్తుంది. దేశ ఆర్థిక స్థితిని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెడతారు.

పన్ను చెల్లించే మహిళలు కూడా అనేక అంచనాలతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో మహిళా పన్ను చెల్లింపుదారులు పెరుగుతున్నారు. ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం మునుపటి పన్ను భారాన్ని తగ్గించడానికి, మహిళలకు మరిన్ని ఆర్థిక అవకాశాలను సృష్టించడానికి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.
పెట్టుబడులకు ప్రోత్సహం
మహిళా పారిశ్రామికవేత్తల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న వారి సహకారంతో యూనియన్ బడ్జెట్‌లో మహిళల నేతృత్వంలోని వ్యవస్థాపకత, వ్యాపారాలు మొదలైనవాటిని ప్రోత్సహించడానికి పన్ను తగ్గింపులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది పన్ను తగ్గింపు, ప్రోత్సాహకాలను కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహిళలు స్టార్టప్‌లలో పెట్టుబడి పెడితే సహకారం కూడా ఉండనుంది.
రుణాలు తీసుకునే సదుపాయం
మహిళల ఆధ్వర్యంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు తక్కువ పన్నులు, సులభమైన రుణ సదుపాయాలు, వ్యాపార వృద్ధికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తే మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి అడ్డంకులు తగ్గుతాయి. రానున్న బడ్జెట్‌లో మహిళలకు రుణసదుపాయం మెరుగుపడే అవకాశం ఉంది. ప్రభుత్వం మహిళా వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు క్రెడిట్‌ను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పథకాలను ప్రవేశపెట్టవచ్చు.
తక్కువ వడ్డీ రేట్లు
సరళీకృత రుణ ప్రక్రియలు, తక్కువ వడ్డీ రేట్లు, మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి లేదా వారి వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. మహిళలకు ఇచ్చే పన్ను ప్రోత్సాహకాలు ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
మహిళలు తమ స్వంత గృహాలను కలిగి ఉండేలా సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. మహిళా కొనుగోలుదారులు గృహ రుణాలపై మెరుగైన పన్ను మినహాయింపుల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇది మహిళలను దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహిస్తుంది. విద్యా రుణాలకు పన్ను రాయితీలు అందించడం ద్వారా ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రోత్సహించవచ్చు. ఇది మహిళలకు ఉన్నత విద్యను పొందే మార్గాన్ని సులభతరం చేయడమే కాకుండా మెరుగైన ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్యాలను కూడా అందిస్తుంది. బడ్జెట్ 2025లో మహిళా పన్ను చెల్లింపుదారులు వ్యక్తిగత, ఆర్థిక వృద్ధికి, వ్యాపారం ప్రోత్సహించే అవకాశాలను ఆశించవచ్చు.