Budget 2025 : బడ్జెట్‌లో పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై మీద పెద్ద ప్రకటనకు ఛాన్స్.. బీమా కవరేజీ పెంచవచ్చు
Budget 2025 : మరికొన్ని రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఈసారి బీమా కవరేజీకి సంబంధించి పెద్ద ప్రకటన ఉండనుందని అంచనా ఉంది. ఆ వివరాలేంటో చూద్దాం..
ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందులో బీమా కవరేజీకి సంబంధించి పెద్ద ప్రకటన చేయవచ్చు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద బీమా కవరేజీని పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. దీని ద్వారా బలహీన వర్గాలకు ఆర్థిక భద్రతను పెంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. అంతేకాకుండా 2047 నాటికి అందరికీ బీమా అనే కోణం నుండి కూడా దీనిపై ఆలోచనలు చేస్తున్నారు. దీని కింద భారతదేశం అంతటా సమగ్ర బీమా అందించాలనే ప్లాన్ ఉంది.

పీఎంజేజేబీవై కింద జీవిత బీమా పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే ప్రణాళికపై కసరత్తు జరుగుతోంది. అధిక కవరేజీని అందించడం ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యం. పెరిగిన కవరేజ్ బీమా చేసిన వ్యక్తులకు, వారిపై ఆధారపడిన వారికి మెరుగైన ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. తద్వార ప్రజలకు ఆర్థికంగా భరోసాగా ఉండనుంది ప్రభుత్వం.
కోట్ల మందికి లబ్ధి
మింట్ ప్రకారం ఫిబ్రవరి 1న సమర్పించే బడ్జెట్‌లో ఈ మార్పులను ప్రకటించవచ్చు. గత నెలలో పీఎంజేజేబీవై భారతదేశం అంతటా 21 కోట్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు రూ. 2 లక్షల జీవిత బీమాను అందించినట్లు నివేదించింది. అక్టోబర్ 20, 2024 నాటికి ఎన్‌రోల్‌మెంట్ 21.6 కోట్లకు చేరుకుంది. ఇందులో రూ.17,211.50 కోట్ల విలువైన క్లెయిమ్‌లు పరిష్కరం అయ్యాయి.
బీమా పెంచే అవకాశం
పీఎంజేజేబీవై అనేది ఒక సంవత్సర జీవిత బీమా పథకం. ఇది ఏదైనా కారణం వల్ల మరణాన్ని కవర్ చేస్తుంది. పీఎంఎస్‌బీవై ఒక సంవత్సరం కవరేజీతో ప్రమాదవశాత్తు మరణం, వైకల్యంపై ప్రమాద బీమాను అందిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం పునరుద్ధరిస్తారు. రెండు పథకాల కింద కవరేజీని పెంచడానికి చర్చలు జరుగుతున్నాయి. రాబోయే బడ్జెట్‌లో వీటిపై సర్దుబాట్లు జరిగే ఛాన్స్ ఉంది.
ప్రీమియం ఖర్చు
పెరిగిన ప్రీమియంతో ఎక్కువ కవరేజీని ఎంచుకోవచ్చు. లేదనుంటే ఇప్పటికే ఉన్న రూ.2 లక్షల కవర్‌ని కలిగి ఉండవచ్చు. ప్రస్తుతం పీఎంఎస్‌బీవై ఖర్చు సంవత్సరానికి రూ. 20 కాగా, పీఎంజేజేబీవై ఖర్చు సంవత్సరానికి రూ. 436గా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం బీమా కవరేజీ పెంచితే.. దానికి అనుగుణంగా కొత్త ప్రీమియం రేట్లు నిర్ణయిస్తారు. ఎక్కువ మందికి ఈ పథకాలు ఉపయోగాపడాలని కేంద్రం భావిస్తోంది కాబట్టి ఎక్కువ మెుత్తంలో పెంచకపోవచ్చు.