Budget 2025 : సామాన్యులకు ఉపశమనం కలిగించేలా నిర్మలమ్మ వీటికి పచ్చజెండా ఊపుతారా?
Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్‌లో సామాన్యులకు చాలా అంచనాలు ఉన్నాయి. బడ్జెట్‌లో రాయితీల కోసం వివిధ శాకలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయం దగ్గర పడింది. చాలా రంగాల నుంచి బడ్జెట్ మీద అనేక అంచనాలు ఉన్నాయి. సామాన్యులు సైతం అనేక అంచనాలతో ఉన్నారు. అదేవిధంగా సాధారణ పన్ను చెల్లింపుదారులు కూడా కేంద్ర బడ్జెట్ నుండి కొన్ని రాయితీలను ఆశిస్తున్నారు.

స్టాండర్డ్ డిడక్షన్‌లో మార్పు
జీతం పొందే పన్ను చెల్లింపుదారులను ఉపయోగపడేలా కొత్త పన్ను విధానంలో ఇచ్చే ఆదాయపు పన్ను స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 1 లక్షకు పెంచవచ్చని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.75,000 ఫిక్స్‌డ్ డిడక్షన్ ఉంది. ఇంత మెుత్తం ఆదాయంపై ఎలాంటి ప్రూఫ్ లేకుండా పన్ను తగ్గించుకోవచ్చు. ఎక్కవగా మధ్యతరగతివారు, ఉద్యోగులు దీనితో ప్రయోజనం పొందుతారు.
ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి
కొత్త పన్ను విధానంలోకి మారేందుకు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నందున పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని అంటున్నారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలుగా ఉంది. ఈ ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచవచ్చు. ఇది ఖర్చు చేయడానికి లేదా పొదుపు చేయడానికి మరింత ఉపయోగకరంగా ఉండనుంది.
పన్ను మినహాయింపు
కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు వార్షిక ఆదాయం ప్రస్తుతం పన్ను నుండి మినహాయింపు ఉంది. కేంద్ర బడ్జెట్‌లో ఈ పరిమితిని రూ.10 లక్షలకు పెంచవచ్చని భావిస్తున్నారు. ఇది నిజమైతే మధ్య-ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఇది ఉపశమనం కలిగించి. వారి ఆర్థిక నిర్వహణను సులభతరం చేస్తుంది.
గృహనిర్మాణ రంగం
అందరికీ గృహాలు, ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కొత్త పన్ను విధానంలో సొంత నివాసం కోసం తీసుకున్న గృహ రుణాలపై వడ్డీ మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలనే డిమాండ్ ఉంది. హోమ్ లోన్ ఉన్నవారికి పన్ను మినహాయింపు పెంపు గురించి కూడా చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.
ఆస్తి అమ్మకం
ఆస్తిని విక్రయించే వ్యక్తి నాన్ రెసిడెంట్(ఎన్ఆర్) అయితే ఆస్తి కొనుగోలుదారు ఈ వన్-టైమ్ లావాదేవీకి TAN పొందాలి. ఎక్కువ రేటుతో పన్ను మినహాయించి టీడీఎస్ రిటర్న్‌ను ఫైల్ చేయాలి. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. దీన్ని సులభతరం చేయడానికి, స్థానికుల వలె విదేశాలలో నివసిస్తున్న అమ్మకందారుల కోసం చలాన్ కమ్ స్టేట్‌మెంట్‌ను ప్రవేశపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణించాలని కొందరు కోరుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను
కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లడానికి, సెక్షన్ 80EEP (ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు కోసం రుణంపై వడ్డీపై మినహాయింపు) కింద మినహాయింపును పునరుద్ధరించాలనే డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రాయితీతో వీటి వైపు కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.