Budget 2025 For Women : మహిళలకు బడ్జెట్‌లో గుడ్‌న్యూస్.. రూ.2 కోట్ల వరకు బిజినెస్ లోన్!
Budget 2025 For Women : బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉపయోగపడేలా కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అనేక అంచనాల మధ్య వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల కోసం బడ్జెట్‌కు సంబంధించి ప్రత్యేక ప్రకటనలు చేశారు. వెనుకబడిన తరగతుల మహిళలకు రుణ పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు.

కొత్త పథకం
5 లక్షల మంది షెడ్యూల్డ్ కులాలు/తెగల మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పారు. దీని ద్వారా టర్మ్ లోన్ అందించనున్నారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు, ఇప్పటికే వ్యాపారం చేస్తూ.. పెంచుకోవాలనుకునే మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. దీంతో వచ్చే ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కొత్త ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.
2 కోట్ల వరకు టర్మ్ లోన్
ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు రుణ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. దీని ద్వారా దేశంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు వచ్చే ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్స్ ఇవ్వనున్నారు. దీని ద్వారా వారి వ్యాపారాని కేంద్రం అండగా ఉండనుంది. ఆన్‌లైన్‌లో బిజినెస్ ఎలా ప్రోత్సహించాలి, నిర్వాహక నైపుణ్యాలువంటివి కూడా ఈ పథకంలో భాగంగా నేర్పిస్తారు.
'అభివృద్ధిని వేగవంతం చేసేందుకు మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బడ్జెట్ కొనసాగిస్తోంది. సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు, ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.' అని నిర్మలా సీతారామన్ అన్నారు.
క్రెడిట్ గ్యారంటీ
మరోవైపు ప్రభుత్వం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) క్రెడిట్ గ్యారెంటీ కవర్‌ను ప్రస్తుత రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్లకు మెరుగుపరుస్తుంది. వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల అదనపు క్రెడిట్‌ను అందజేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు. భారతదేశ ఎగుమతుల్లో దాదాపు 45 శాతం MSMEలదే బాధ్యత అని సీతారామన్ అన్నారు. వీటికి సంబంధించి ఈ ప్రకటన తర్వాత అందులో పనిచేసే వ్యక్తులకు మరింత సాయంగా ఉంటుందన్నారు.
10 లక్షల కార్డులు
ప్రభుత్వం Udyam పోర్టల్‌లో నమోదు చేసుకున్న మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కోసం కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డ్‌లను కూడా ప్రారంభించనుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ. 5 లక్షల పరిమితితో తొలి ఏడాది కనీసం 10 లక్షల కార్డులు జారీ చేస్తామని చెప్పారు.