Budget 2025 : కేంద్ర బడ్జెట్‌లో కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న అన్నదాతలకు శుభవార్త ఉండనుందా?
Budget 2025 : బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మరికొన్ని రోజులే మిగిలి ఉంది. అన్ని రంగాల నుంచి బడ్జెట్ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. రైతులు కూడా ఈసారి బడ్జెట్ మీద ఆశలు పెట్టుకున్నారు.
బడ్జెట్‌పై అన్ని వర్గాల్లోనూ అంచనాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రోజులు దగ్గరకు వచ్చాయి. రైతులకు సంబంధించిన కాస్త ఎక్కువే అంచనాలు ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎలాంటి కేటాయింపులు చేస్తుందనే అంశంపై కూడా చర్చ ఉంది.

ఈ బడ్జెట్‌లో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోందని చాలా మంది భావిస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. గత బడ్జెట్‌ల మాదిరిగానే ఈ బడ్జెట్‌లో కూడా వ్యవసాయ రంగానికి మేలు చేసే కీలక ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంపు, వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు, వ్యవసాయానికి సబ్సిడీ పెంపు తదితర ప్రకటనలు బడ్జెట్ లో ఉండే ఛాన్స్ ఉంది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది.
కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఈ చర్య రైతుల ఆదాయ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది వారి వ్యవసాయ కార్యకలాపాలపై మరింత పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది. రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తక్కువ వడ్డీకి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందవచ్చు.
ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డుల క్రెడిట్ లిమిట్ 3 లక్షలు కాగా దానిని 5 లక్షలకు పెంచేందుకు బడ్జెట్ సందర్భంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. వ్యవసాయ ఇన్‌పుట్‌లపై జీఎస్టీ పన్నును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మార్కెట్‌లో విత్తనాలు, ఎరువులపై వేర్వేరుగా జీఎస్టీ విధించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని తగ్గించడం ద్వారా రైతుల లాభాలను పెంచవచ్చు. బడ్జెట్‌లో దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఉండొచ్చు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి బడ్జెట్‌లో కిందటితో పోల్చుకుంటే గ్రాంట్‌ను 5 శాతం నుంచి 7 శాతం పెంచాలనే డిమాండ్ ఉంది.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో కేంద్ర బడ్జెట్. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సమర్పించనున్న ఎనిమిదో కేంద్ర బడ్జెట్. ఈసారి భారీ అంచనాలున్నాయి.