Budget 2025 : గిగ్ వర్కర్లకు మంచి రోజులు.. ఐడీ కార్డులు, ఆరోగ్య బీమా.. ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్!
Budget 2025 : గిగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుందని బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది వారికి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందిస్తుందని కేంద్రమంత్రి చెప్పారు.
దేశంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో సంబంధం ఉన్న గిగ్ వర్కర్లు, ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో కీలక ప్రకటన చేసింది. గిగ్ వర్కర్ల గుర్తింపు, నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుందని, ఇది వారికి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా చెప్పారు.

గిగ్ వర్కర్లకు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఈ కొత్త నిబంధన కింద గిగ్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ వర్కర్లకు గుర్తింపు కార్డు, ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది. వీటితో పాటు ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(పీఎంజేఏవై) కింద వారికి ఆరోగ్య బీమా సదుపాయం కూడా లభిస్తుంది. దీని వల్ల దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
గిగ్ వర్కర్లను ప్రభుత్వం ఎందుకు ఆదుకుంటోంది?
ప్రస్తుత కాలంలో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు, లాజిస్టిక్స్, ఆన్‌లైన్ సేవల్లో లక్షలాది మంది గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వారి ఉపాధి తాత్కాలికమే తప్ప కంపెనీలు ఎలాంటి అదనపు భద్రత, ప్రయోజనాలు ఇవ్వవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గిగ్ ఎకానమీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ-శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్
గిగ్ వర్కర్లకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఇ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయనుంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఇప్పటికే పనిచేస్తున్న ఈ పోర్టల్‌లో ఇకపై గిగ్ వర్కర్లను కూడా చేర్చనున్నారు.
ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్(జొమాటో, స్విగ్గీ వంటివి), క్యాబ్ డ్రైవర్లు (ఉబెర్, ఓలా వంటివి), ఫ్రీలాన్స్ డిజైనర్లు, కంటెంట్ క్రియేటర్లు, లాజిస్టిక్స్ సిబ్బంది, ఇతర ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది.
గిగ్ వర్కర్లు అంటే ఎవరు?
పే ఫర్ వర్క్ ప్రాతిపదికన నియమించిన ఉద్యోగులను గిగ్ వర్కర్స్ అంటారు. అయితే ఇలాంటి ఉద్యోగులు కంపెనీలతో సుదీర్ఘకాలం పాటు అనుబంధం కలిగిన వారూ ఉన్నారు. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో స్వతంత్రంగా పనిచేసే ఉద్యోగులు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లో పనిచేసే ఉద్యోగులు, కాల్ ఆన్ వర్క్స్ అందుబాటులో ఉన్న ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు ఉన్నారు.
గిగ్ వర్కర్లకు ఇది సామాజిక భద్రతను అందిస్తుంది. ఆరోగ్య సమస్యల ఉన్నవారు ఆరోగ్య బీమా వాడుకోవచ్చు. ఈ నిర్ణయం గిగ్ వర్కర్లకు ఒక పెద్ద అడుగుగా కాబోతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు గిగ్ వర్కర్ల సహకారాన్ని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. 'ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ కార్మికులు లేదా గిగ్ వర్కర్లు ఆర్థిక వ్యవస్థకు గొప్ప సాయాన్ని అందిస్తారు. మా ప్రభుత్వం వారికి ఇ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌తో ఐడీ కార్డులను ఏర్పాటు చేస్తుంది. వారికి ఆరోగ్య రక్షణను అందిస్తుంది.' అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.