Budget 2025: అప్ డేట్ చేసిన పన్ను రిటర్నుల కాలపరిమితి పొడిగింపు; ఇకపై నాలుగేళ్లు
Budget 2025: అప్ డేట్ చేసిన ఆదాయ పన్ను రిటర్నుల కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. అప్ డేట్ చేసిన ఐటీఆర్ ల కాలపరిమితిని ప్రస్తుతం ఉన్న రెండు సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
Budget 2025: 2022 నుంచి దాదాపు 90 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు అదనపు పన్ను చెల్లించి స్వచ్ఛందంగా తమ ఆదాయాన్ని అప్డేట్ చేసుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతూ చెప్పారు. దీంతో అప్డేట్ చేసిన రిటర్న్ ఫైలింగ్ వ్యవధిని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పొడిగించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంటే, గత నాలుగేళ్ల ఐటీఆర్ లను అప్ డేట్ చేయవచ్చు. లేదా కొత్తగా గత నాలుగేళ్లకు సంబంధించిన ఐటీఆర్ లను ఫైల్ చేయవచ్చు.

బడ్జెట్ 2025 లో ఆదాయ పన్ను వివరాలు
ఆర్థిక మంత్రి సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో, "పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా తమ ఆదాయాన్ని వెల్లడించడం కోసం 2022 లో అప్ డేటెడ్ రిటర్న్ సదుపాయాన్ని తీసుకువచ్చాము. పన్ను చెల్లింపుదారులపై మాకున్న నమ్మకం నిజమని రుజువైంది. దాదాపు 90 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా అదనపు పన్ను చెల్లించి తమ ఆదాయాలను అప్డేట్ చేసుకున్నారు. ఈ నమ్మకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, ఏదైనా మదింపు సంవత్సరానికి అప్డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేయడానికి ప్రస్తుత పరిమితిని రెండు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాలకు పొడిగించాలని నేను ఇప్పుడు ప్రతిపాదిస్తున్నాను’ అని నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
కొత్త ఐటీ బిల్లు
ఆదాయ పన్ను వ్యవస్థను నియంత్రించే ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయ పన్ను చట్టం స్థానంలో సరళమైన, ఆకర్షణీయమైన కొత్త చట్టాన్ని తీసుకువస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు, ఇది భారత న్యాయ సంహిత తరహాలో ‘న్యాయం’ స్ఫూర్తిని కలిగి ఉంటుందని, "మొదట విశ్వాసం, తరువాతే పరిశీలన" అనే సూత్రంపై ఇది పనిచేస్తుందని చెప్పారు.