Budget 2025 date : నిర్మల 8వ ‘బడ్జెట్’.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు? టైమ్ ఏంటి?
Budget 2025 date and time : బడ్జెట్ 2025ని నిర్మలా సీతారామన్ ఎప్పుడు, ఎక్కడ ప్రవేశపెట్టబోతున్నారు? బడ్జెట్ ప్రసంగం ఎక్కడ ప్రత్యక్షమవుతుంది? ఎలా చూడాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారం చివరిలో, అంటే.. ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్మల బడ్జెట్‌ని తీసుకురావడం ఇది 8వసారి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడొవసారి అధికారంలోకి వచ్చిన అనంతరం నిర్మల ప్రవేశపెడుతున్న రెండో పూర్తిస్థాయి బడ్జెట్. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కి సంబంధించి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బడ్జెట్ 2025- డేట్, టైమ్..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025 న పార్లమెంట్లో బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆమె ప్రసంగం ప్రారంభమవుతుంది.
గత నాలుగు కేంద్ర బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ మాదిరిగానే 2025-26 పూర్తి కేంద్ర బడ్జెట్ సైతం కాగిత రహిత రూపంలోనే ఉండనుంది.
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా.. నిర్మలమ్మ బడ్జెట్‌పై మధ్యతరగతి ప్రజలు భారీ అంచనాలు పెట్టున్నారు. ఆదాయపు పన్ను విషయంలో ఊరట దక్కుతుందని భావిస్తున్నారు.
బడ్జెట్ 2025- ఎలా చూడాలి?
- కేంద్ర బడ్జెట్‌ని పార్లమెంటు అధికారిక ఛానళ్లు, దూరదర్శన్, సంసద్ టీవీల్లో ప్రసారం చేయనున్నారు.
- ఇది ప్రభుత్వ అధికారిక యూట్యూబ్ ఛానెళ్లలో కూడా ప్రసారం కానుంది.
- నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025 ప్రసంగాన్ని https://telugu.hindustantimes.com/ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
- బడ్జెట్ 2025 గురించి అన్ని తాజా అప్డేట్లను హెచ్‌టీ తెలుగు బడ్జెట్ లైవ్ బ్లాగ్‌లో ట్రాక్ చేయవచ్చు.
బడ్జెట్ పత్రాలకు డిజిటల్ యాక్సెస్ కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ పోర్టర్లో www.indiabudget.gov.in అందుబాటులో ఉంటుంది.
రాజ్యాంగం నిర్దేశించిన వార్షిక ఆర్థిక ప్రకటన (సాధారణంగా బడ్జెట్ అని పిలుస్తారు), డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (డీజీ), ఫైనాన్స్ బిల్లు మొదలైన వాటితో సహా అన్ని కేంద్ర బడ్జెట్ పత్రాలు బడ్జెట్‌కి ఈజీ యాక్సెస్ కోసం 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్'లో లభిస్తాయి.
బడ్జెట్ డాక్యుమెంట్లు హిందీ, ఇంగ్లిష్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటాయి.
బడ్జెట్ 2025కి ముందు హల్వా వేడుక - దీని ప్రాముఖ్యత ఏమిటి?
1980వ దశకం నుంచి భారతీయ బడ్జెట్ తయారీ ప్రక్రియలో ఆనవాయితీగా వస్తున్న హల్వా వేడుక కేంద్ర బడ్జెట్ తయారీలో చివరి దశను సూచిస్తుంది. ఈ వేడుక తర్వాత బడ్జెట్ తయారు చేసిన అధికారులను నార్త్ బ్లాక్‌లోని గదిలో లాక్ చేస్తారు. బడ్జెట్ తర్వాత విడుదల చేస్తారు.
2025 బడ్జెట్ తయారీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది?
ఆర్థిక మంత్రిత్వ శాఖ 2024 అక్టోబర్‌లో బడ్జెట్ తయారీని ప్రారంభించింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక అంచనాలు, అవసరాలను ఖరారు చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరుపుతోంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 లో అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక సాంప్రదాయ బడ్జెట్ లక్షణాలను తొలగించింది. 2017లో ప్రధాన బడ్జెట్‌తో రైల్వే బడ్జెట్‌ని కలపడం, బడ్జెట్‌ని ప్రవేశపెట్టే తేదీని నెలాఖరు నుంచి ఫిబ్రవరి 1కి మార్చడం, 2021లో డిజిటల్ ఫార్మాట్‌కి షిఫ్ట్ అవ్వడం వంటివి ఇందులో ఉన్నాయి.
సంబంధిత కథనం