Budget 2025 : వృద్ధి, ఇన్నోవేషన్, ఈవీ పుష్- 'బడ్జెట్'పై ఆటోమొబైల్ పరిశ్రమలో భారీ ఆశలు..
Budget 2025 expectations : బడ్జెట్ 2025పై దేశ ఆటోమొబైల్ పరిశ్రమ భారీ ఆశలే పెట్టుకుంది! వృద్ధి, ఇన్నోవేషన్, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, శనివారం పార్లమెంట్లో బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టనున్నారు. సామాన్యుడి నుంచి వ్యాపారవేత్తల వరకు ఈ దఫా బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఈసారి భారీ అంచనాలే పెట్టుకుంది. వృద్ధి, ఇన్నోవేషన్, సుస్థిరత, ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఊతమిచ్చే విధంగా నిర్మలా సీతారామన్ చర్యలు చేపట్టాలని ఆటోమొబైల్ ఇండస్ట్రీ భావిస్తోంది.

బడ్జెట్ 2025పై ఆటోమొబైల్ పరిశ్రమ ఆశలు..
ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తుపై బడ్జెట్ 2025 కీలక పాత్ర పోషించనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుందని ఆశిస్తున్నాయి. స్థానిక తయారీకి ఊతమిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు సిఫార్సులు చేస్తున్నారు. దీనితో పాటు రోజురోజుకు పెరిగిపోతున్న ముడి సరకు ధరలు, సప్లై చెయిన్‌లో లోపాలు వంటి సమస్యలను పరిష్కరడంపై దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నారు.
"సుస్థిరతో కూడిన సమానమైన వృద్ధి, ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ చేయడాన్ని మేము అభినందిస్తున్నాము. బలమైన సప్లై చెయిన్ వ్యవస్థను, ఇన్నోవేషన్ హబ్‌ని, నైపుణ్య వృద్ధిని, సులభతర వాణిజ్యాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాము. ఎనర్జీ వెహికిల్స్‌పై ట్యాక్స్ విషయంలో ఊరట లభిస్తుందని అంచనా వేస్తున్నాము. మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాము. తద్వారా ప్రజల్లో స్పెండింగ్ పవర్ పెరిగి పరిశ్రమకు మంచి జరుగుతుంది," అని బడ్జెట్ 2025 నేపథ్యంలో రెనాల్ట్ ఇండియా సీఈఓ- ఎండీ వెంకటరామ్ మామిల్లపల్లె అభిప్రాయపడ్డారు.
"పెట్టుబడులను కొనసాగిస్తూ మౌలికవసతుల వృద్ధిని పెంచాలన్న ప్రభుత్వ సంకల్పంతో లాజిస్టిక్స్ ఖర్చులు దిగొస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీమ్‌తో కీలక సెక్టార్లు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలు మెరుగుపడ్డాయి. ఫలితంగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ అంతర్జాతీయ పరిశ్రమతో పోటీ పడుతోంది. రానున్న బడ్జెట్లో పీఎల్ఐని మరింత విస్తరిస్తారని ఆశిస్తున్నాము. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీకి ఊతం ఇచ్చే విధంగా ప్రభుత్వం విధానాలను ప్రకటిస్తుందని ఆశిస్తున్నాము. యువత నైపుణ్యాన్ని పెంచాలని, ఎంఎస్ఎంఈలకు సాయం చేయాలని, ఆర్ అండ్ డీని ప్రమోట్ చేయాలని, ఇన్నోవేషన్‌కి మద్దతివ్వాలని కోరుకుంటున్నాము," అని టయోటా కిర్లోస్కర్ మోటార్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్- హెడ్ విక్రమ్ గులాటి అన్నారు.
అంతేకాదు కీలకమైన టైర్ మేన్యుఫ్యాక్చరీంగ్ పరికరాలపై జీఎస్టీని హేతుబద్ధీకరించాలని పరిశ్రమ కోరుకుంటోంది. ఇలా చేస్తే ప్రొడక్షన్ ఖర్చులు మరింత తగ్గుతాయని చెబుతోంది.
దేశంలో ఈవీ విధానాలపై అనిశ్చితి కొనసాగుతున్నా, 2030 నాటికి గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ పెట్టుబడులు రూ. 4.1 లక్షల కోట్లకు చేరుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ఈవీ అడాప్షన్ వేగంగా జరుగుతోందని, ఇది పరిశ్రమ మొత్తానికి మంచి అవకాశాలను ఇస్తుందని నివేదిక సూచించింది. ఈవీ విధానాల్లో మార్పులు, మౌలికవసతుల వృద్ధి, ఆర్ అండ్ డీలో ప్రభుత్వ మద్దతు కీలకంగా మారనుంది. వీటితో టైర్ పరిశ్రమ కూడా లాభపడుతుంది. ఈ సెక్టార్‌లోనూ సుస్థిర వృద్ధి కనిపిస్తుంది. తద్వారా క్వాలిటీ, టెక్నాలజీ విషయంలో దేశం అంతర్జాతీయ లీడర్‌గా ఎదుగుతుందని పరిశ్రమ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి.
మరి ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందిస్తుందా? నిర్మల ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2025తో ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాలు, ఆశలు నెరవేరుతాయా? ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న నిర్మల బడ్జెట్ స్పీచ్‌తో దీనిపై స్పష్టత వస్తుంది.
సంబంధిత కథనం