Budget 2024 : ఈ మాటలన్నింటికీ అర్థం తెలిస్తే బడ్జెట్ ఈజీగా అర్థమవుతుంది-budget 2024 you dont need to study economics to understand the budget just know the meaning of all these words ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024 : ఈ మాటలన్నింటికీ అర్థం తెలిస్తే బడ్జెట్ ఈజీగా అర్థమవుతుంది

Budget 2024 : ఈ మాటలన్నింటికీ అర్థం తెలిస్తే బడ్జెట్ ఈజీగా అర్థమవుతుంది

Anand Sai HT Telugu

Budget 2024 : బడ్జెట్ అనగానే చాలామందికి కొన్ని విషయాలు అర్థం కావు. ద్రవ్య లోటు, పెట్టుబడుల ఉపసంహరణ.. ఇలాంటివి కొన్ని పదాలు ఏంటో అనిపిస్తుంది. అయితే వాటి గురించి తెలిస్తే.. ఇంతేనా అనుకుంటారు. బడ్జెట్ అర్థమయ్యేందుకు ముఖ్యమైన కొన్ని పదాల గురించి తెలుసుకోండి.

బడ్జెట్ 2024

కేంద్ర బడ్జెట్ టైమ్ వచ్చేసింది. బడ్జెట్‌లో కొన్ని నిర్దిష్ట ఆర్థిక పదాలు ఉంటాయి. అవి ఎకనామిక్స్ చదివినవారికే కాదు.. సామాన్యులకు కూడా అర్థం చేసుకుంటే అర్థమవుతాయి. ఇందుకోసం మీరు వాటి అర్థం తెలుసుకోవాలి అంతే. ఆ తర్వాత మీకే ఈజీగా ఆ పదాల గురించి తెలుస్తుంది. వాటి గురించి సింపుల్ లాంగ్వేజ్‌లో తెలుసుకుందాం..

ఆర్థిక విధానం

పన్నుల వ్యయం, ప్రభుత్వం రుణాలు తీసుకోవడంతో సహా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ప్రభుత్వం ఆదాయం, వ్యయాలను ఎలా నిర్వహిస్తుంది అనేది ఆర్థిక విధానం.

ద్రవ్య విధానం

ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడానికి, ఆర్థిక వృద్ధికి సహాయం చేయడానికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య సరఫరా మరియు వడ్డీ రేట్లను నియంత్రించడానికి సంబంధించిన విధానాలను రూపొందిస్తుంది. ఇది ద్రవ్య విలువ సూత్రం.

ద్రవ్య లోటు

ప్రభుత్వ మొత్తం వ్యయం, ప్రభుత్వ మొత్తం ఆదాయం (రుణాలు మినహా) మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటు అంటారు. దీని ద్వారా ప్రభుత్వం ఎంత రుణం తీసుకోవాలో నిర్ణయించవచ్చు.

GST

GST అనేది వస్తువు సేవల అమ్మకం, వినియోగంపై భారతదేశం అంతటా విధించే పన్నుల వ్యవస్థ. గుడ్స్ సర్వీస్ ట్యాక్స్.

కేంద్ర బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ప్రకటనగా ఏటా సమర్పించేది కేంద్ర బడ్జెట్. ప్రభుత్వం ఎంత ఆదాయాన్ని అంచనా వేస్తుంది. ఎంత వ్యయాన్ని అంచనా వేస్తుందనే దానితో సహా మొత్తం సమాచారం ఇందులో ఉంటుంది.

ఆదాయ వ్యయం

ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకు సబ్సిడీ మొత్తం, వడ్డీ ఆదాయం ఉంటాయి.

ప్రత్యక్ష, పరోక్ష పన్నులు

కార్పొరేట్ ఆదాయపు పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు, GST వంటి పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాలు.. వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలపై విధించవచ్చు.

మూలధన వ్యయం

మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, నిర్దిష్ట ఆస్తులను కొనుగోలు చేయడానికి, దీర్ఘకాలిక ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం చేసే ఖర్చును మూలధన వ్యయం అంటారు. ఈ ఖర్చులు దీర్ఘకాలంలో ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటాయి.

GDP

జీడీపీ అనేది ఒక నిర్దిష్ట కాలంలో దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల మొత్తం విలువ. స్థూల దేశీయోత్పత్తి (GDP) అనేది సరళంగా చెప్పాలంటే ఒక సంవత్సరంలో దేశం ఆర్థిక ఉత్పత్తి కొలమానం.

పెట్టుబడుల ఉపసంహరణ

ప్రభుత్వం తన ఆస్తులను విక్రయించి, వాటి ద్వారా డబ్బు ఆర్జిస్తుంది లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను విక్రయిస్తూ తన ఆదాయాన్ని పెంచుకుంటుంది.