Budget 2024: రైతన్నల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి; బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు-budget 2024 focus on nano dap food processing post harvest initiatives ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024: రైతన్నల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి; బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు

Budget 2024: రైతన్నల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి; బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు

HT Telugu Desk HT Telugu
Published Feb 01, 2024 03:55 PM IST

Agriculture sector in Budget 2024: 2024 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో వ్యవసాయ, వ్యవసాయ అధారిత రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వయం సమృద్ధి దిశగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడం, ఆక్వాకల్చర్ కోసం ఐదు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భారత్ లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 2024-45 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పలు ప్రతిపాదనలు చేశారు. వీటిలో, వివిధ పంటలకు నానో డీఏపీ (Nano DAP) ని ఉపయోగించడం, కోత అనంతర నష్టాలను తగ్గించడానికి ఆధునిక వ్యవసాయంలో ప్రైవేట్-ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. గతంలో, 2021 ఆర్థిక సంవత్సరంలో నానో యూరియాను కూడా ప్రవేశపెట్టారు.

స్వయం సంమృద్ధి

నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఆక్వాకల్చర్ కోసం ఐదు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో విలువ జోడింపు, రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలను ముమ్మరం చేస్తామన్నారు. ‘‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన 3.8 మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. 1 మిలియన్ మందికి ఉపాధిని సృష్టించింది’’ అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ యోజన (PMFME) తో కూడా లక్షలాది రైతులకు ప్రయోజనం కలిగిందన్నారు.

కేటాయింపులు..

2024- 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖకు రూ .3,290 కోట్లను కేటాయించారు. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ .3,288 కోట్లతో పోలిస్తే కొద్దిగా పెరిగింది. ఈ కేటాయింపుల్లో PMFME పథకానికి కేటాయింపులను ప్రస్తుత ఏడాది బడ్జెట్ లో కేటాయించిన రూ.639 కోట్ల నుంచి రూ.880 కోట్లకు పెంచారు. అగ్రిగేషన్, ఆధునిక నిల్వ, సమర్థవంతమైన సప్లై చెయిన్ లతో సహా కోత అనంతర కార్యకలాపాలలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ .1.17 ట్రిలియన్లు కేటాయించారు, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే కొద్దిగా ఎక్కువ. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు కేటాయింపులు రూ .1.64 ట్రిలియన్లుగా ఉన్నాయి. ఎరువుల సబ్సిడీ కోసం సుమారు రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు.

నానో డీఏపీ

నానో యూరియా విజయవంతం కావడంతో వివిధ పంటలు, వ్యవసాయ వాతావరణ మండలాల్లో నానో డీఏపీ వినియోగాన్ని విస్తరిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాడిపరిశ్రమ కోసం కూడా పలు కార్యక్రమాలను మంత్రి ప్రకటించారు. పాడి పశువుల ఉత్పత్తిని పెంచడానికి ఒక సమగ్ర కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వంటి పథకాలను ఆమె గుర్తు చేశారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు అని ఆర్థిక మంత్రి తెలిపారు.

మత్స్య రంగం

మత్స్య రంగానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తించి, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) ద్వారా ఆక్వాకల్చర్ ఉత్పాదకతను, ఎగుమతులను పెంచుతున్నారు. అలాగే, త్వరలో ఐదు ఇంటిగ్రేటెడ్ ఆక్వాపార్క్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు గత ఏడాది సవరించిన రూ.5,621 కోట్లతో పోలిస్తే, ఈ బడ్జెట్ లో రూ.7,106 కోట్లు కేటాయించారు.

Whats_app_banner