Budget 2024: అల్పాదాయ వర్గాలకు ఆర్థిక మంత్రి నిర్మల శుభవార్త!; వారికోసం బడ్జెట్ లో కొత్త పన్ను శ్లాబ్!
Budget 2024: మూడో సారి విజయవంతంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్ లో అల్పాదాయ వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయంతో వార్షిక ఆదాయం రూ .5 లక్షల నుంచి15 లక్షల మధ్య ఉన్నవారికి లబ్ధి చేకూరవచ్చు.
2024 బడ్జెట్ లో అల్పాదాయ వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు ఉండవచ్చని తెలుస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అధిక సంఖ్యాకులుగా ఉన్న అల్పాదాయ వర్గాలపై పన్ను భారాన్ని తగ్గించాలని భావిస్తోంది. తద్వారా వారిలో వస్తు వినిమయ వినియోగం పెరుగుతుందని భావిస్తోంది. బడ్జెట్ 2024 నిర్ణయాల్లో భాగంగా, కొత్త ఆదాయ పన్ను శ్లాబ్ (income tax slab) ను ప్రవేశపెట్ట వచ్చని తెలుస్తోంది.
కొత్త ఆదాయ పన్ను శ్లాబు
ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉన్న వినియోగదారుల వర్గానికి పన్నులు (income tax) తగ్గించే ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏడాదికి రూ.5-10 లక్షల మధ్య ఆదాయం ఉన్న వ్యక్తులపై ప్రస్తుతం 5-20 శాతం పన్ను విధిస్తున్నారు. వారి ఆదాయ పన్ను తగ్గించే విధంగా కొత్త పన్ను శ్లాబును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై తుది నిర్ణయం వెలువడలేదని, ఈ ప్రతిపాదనకు ఇంకా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించలేదని తెలుస్తోంది. బడ్జెట్ (budget 2024) ను ఈ జులై 22 న ప్రవేశపెట్టనున్నారు. ఈ లోపు ఈ ప్రతిపాదనపై స్పష్టత వచ్చే అవకాశముంది.
పీఎం కిసాన్ నిధుల పెంపు
ఈ బడ్జెట్ లో రైతులకు ఏటా మూడు విడతలుగా చెల్లించే పీఎం కిసాన్ నిధులను కూడా పెంచనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. ప్రస్తుతం ప్రస్తుతం రైతులకు ఏటా మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున రూ. 6 వేలు అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ. 8 వేలు చేయాలన్న ప్రతిపాదన ఉంది. అలాగే,
బడ్జెట్ కు ముందు సంప్రదింపులు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారం ఆర్థికవేత్తలు, ట్రేడ్ యూనియన్లు, పరిశ్రమ చాంబర్లతో సహా వివిధ భాగస్వాములతో బడ్జెట్ కు ముందు సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, త్వరలో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిన బీజేపీ, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అందువల్ల ఓటర్లకు ప్రయోజనం చేకూర్చే పలు నిర్ణయాలు ఈ బడ్జెట్ లో ఉండవచ్చని తెలుస్తోంది.
టాపిక్