BSNL Q3 results : బీఎస్ఎన్ఎల్కి పునర్వైభవం! 17ఏళ్ల తర్వాత లాభాల్లోకి..
BSNL Q3 results 2025 : బీఎస్ఎన్ఎల్ క్యూ3 ఫలితాలు వెలువడ్డాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ 2007 ఆర్థిక సంవత్సరం తర్వాత తొలిసారిగా ఇప్పుడు లాభాలను నమోదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక (క్యూ3ఎఫ్వై25) ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ 2007 తర్వాత తొలిసారిగా నికర లాభాన్ని ప్రకటించడం విశేషం. ఫలితంగా.. నాడు ఒక వెలుగువెలిగిన ఈ దిగ్గజ టెలికాం సంస్థకు పునర్వైభవం లభిస్తోందని అందరు భావిస్తున్నారు.
బీఎస్ఎన్ఎల్ క్యూ3 ఫలితాలు..
17ఏళ్ల తర్వాత బీఎస్ఎన్ఎల్ లాభాల్లోకి రావడంపై టెలీకమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. సేవలను అందించడం, చందాదారుల సంఖ్యను విస్తరించడంపై దృష్టి సారించిన టెలికాం దిగ్గజానికి ఈ త్రైమాసిక ప్రదర్శన్ "ముఖ్యమైన మలుపు" అని అభివర్ణించారు. మొబిలిటీ, ఎఫ్టీటీహెచ్, లీజ్డ్ లైన్ సర్వీస్ ఆఫర్లలో బీఎస్ఎన్ఎల్ 14-18 శాతం వృద్ధిని సాధించిందని ఆయన తెలిపారు.
బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య జూన్‌లో 8.4 కోట్ల నుంచి డిసెంబర్ నాటికి తొమ్మిది కోట్లకు పెరిగింది.
"ఈ రోజు బీఎస్ఎన్ఎల్కి, భారతదేశంలో టెలికాం రంగ ప్రయాణానికి ముఖ్యమైన రోజు. బీఎస్ఎన్ఎల్ 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో.. 17 ఏళ్లలో తొలిసారిగా లాభాలను నమోదు చేసింది. బీఎస్ఎన్ఎల్ చివరిసారిగా త్రైమాసిక లాభాన్ని 2007 సంవత్సరంలో నమోదు చేసింది," అని సింధియా పేర్కొన్నారు.
బీఎస్ఎన్ఎల్ మొబిలిటీ సేవల ఆదాయం 15 శాతం, ఫైబర్-టు-ది-హోమ్ (ఎఫ్టీటిహెచ్) ఆదాయం 18 శాతం, లీజు లైన్ సేవల ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. క్యూ3ఎఫ్25లో బీఎస్ఎన్ఎల్ "సృజనాత్మకత, నెట్వర్క్ విస్తరణ, కాస్ట్ ఆప్టిమైజేషన్, కస్టమర్-సెంట్రిక్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించింది," అని నొక్కి చెప్పింది.
బీఎస్ఎన్ఎల్ తన ఫైనాన్స్ ఖర్చులు, టోటల్ కాస్ట్‌ని తగ్గించింది. ఫలితంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి రూ .1,800 కోట్లకు పైగా నష్టాలు తగ్గాయి. కస్టమర్ అనుభవాన్ని పెంపొందించడానికి, బీఎస్ఎన్ఎల్ నేషనల్ వైఫై రోమింగ్, బైటీవీ-ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్ మొబైల్ కస్టమర్స్, ఎఫ్టీటిహెచ్ కస్టమర్లందరికీ ఐఎఫ్టీవీ, మైనింగ్ కోసం మొదటి ప్రైవేట్ 5జీ కనెక్టివిటీ వంటి ఆఫర్లను ప్రవేశపెట్టింది.
ముందున్నవి మంచి రోజులు..!
“ఈ ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికం ముగిసే సమయానికి బీఎస్ఎన్ఎల్ ఆదాయం పెరగడమే కాకుండా, ఖర్చులు- వ్యయాలను అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తాము. గత ఏడాది గణాంకాలతో పోలిస్తే ఈసారి నష్టాలు మరింత తగ్గుతాయని ఆశిస్తున్నాము,” అని సింధియా తెలిపారు.
గత నాలుగేళ్లలో బీఎస్ఎన్ఎల్ ఎబిట్డా రూ.1,100 కోట్ల నుంచి రూ.2,100 కోట్లకు రెట్టింపు అయింది.
“భారతదేశం అంతటా తన చందాదారులకు 4జీ సేవలను అందించడానికి బీఎస్ఎన్ఎల్ కృషి చేస్తున్న సమయంలో త్రైమాసిక ఫలితాల్లో లాభాలు నమోదవ్వడం సంస్థకు కీలక మలుపు. 1,00,000 టవర్లలో 75,000 టవర్లను ఏర్పాటు చేయగా, 60,000 టవర్లను ప్రారంభించారు. జూన్ నాటికి మొత్తం లక్ష టవర్లు పనిచేస్తాయని ఆశిస్తున్నాం,” అని సింధియా తెలిపారు.
బీఎస్ఎన్ఎల్ తన ఫైనాన్స్ ఖర్చు, మొత్తం వ్యయాన్ని తగ్గించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ .1,800 కోట్లకు పైగా నష్టాలు తగ్గడానికి దారితీసింది!
అయితే, ఇతర దిగ్గజ టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియోలు గతేడాది జూన్‌లో రీఛార్జ్ ప్లాన్స్‌ని విపరీతంగా పెంచడంతో చాలా మంది చందాదారులు అసంతృప్తి చెందారు. ఈ సంస్థలను పక్కనపెట్టి, చౌకైన ప్లాన్స్‌ని అందించే బీఎస్ఎన్ఎల్ని ఎంచుకున్నారు. బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య గత కొంతకాలంగా పెరుగుతుండటానికి కారణాల్లో ఇదీ ఒకటి.
సంబంధిత కథనం