ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని ప్రస్తుతమున్న 18 శాతం నుంచి తగ్గించడంపై జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది. తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని సంబంధిత వర్గాలు తెలిపాయి. లైఫ్, హెల్త్, రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం, డేటా, విశ్లేషణలతో కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ సోమవారం ఒక నివేదికను సమర్పించింది.
ఆరోగ్యం, జీవిత బీమాపై జీఎస్టీ రేటు తగ్గింపుపై విస్తృత ఏకాభిప్రాయం కుదిరిందని, అయితే విధివిధానాలను వచ్చే కౌన్సిల్ సమావేశంలో నిర్ణయిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం జరిగింది.
నెలవారీ జీఎస్టీ వసూళ్లు పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నందున చాలా రాష్ట్రాలు రేట్ల తగ్గింపునకు సుముఖంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. జీఎస్టీ రేట్లను తగ్గిస్తే ప్రీమియం తగ్గుతుంది.. కాబట్టి కోట్లాది మంది పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
జూలై 1, 2017న ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మొదటి సంవత్సరంలో రూ.90,000 కోట్లతో పోలిస్తే నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు సుమారు రూ.1.75 లక్షల కోట్లకు చేరుకున్నాయి. జీఎస్టీకి ముందు బీమా ప్రీమియంలపై సేవా పన్ను ఉండేది. 2017లో దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రావడంతో సేవా పన్నును జీఎస్టీలో విలీనం చేశారు.
2023-24లో ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ ద్వారా కేంద్రం, రాష్ట్రాలు రూ.8,262.94 కోట్లు వసూలు చేయగా, హెల్త్ రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ ద్వారా రూ.1,484.36 కోట్లు వసూలయ్యాయి. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు కూడా డిమాండ్ చేశారు. పార్లమెంటులో జరిగిన చర్చల్లో బీమా ప్రీమియంలపై పన్ను విధించే అంశం ప్రస్తావనకు వచ్చింది. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, వసూలైన జీఎస్టీలో 75 శాతం రాష్ట్రాలకు వెళ్తుందని, జీఎస్టీ కౌన్సిల్లో ఈ ప్రతిపాదనను తీసుకురావాలని ప్రతిపక్ష సభ్యులు తమ రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కోరాలని చెప్పారు. గత నెలలో రేట్ల హేతుబద్ధీకరణపై జీవోఎం సమావేశంలో పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య బీమా ప్రీమియం అంశాన్ని లేవనెత్తారు. తదుపరి డేటా విశ్లేషణ కోసం ఈ విషయాన్ని ఫిట్మెంట్ కమిటీకి పంపారు.