Blue Jet Healthcare IPO: బ్లూ జెట్ హెల్త్ కేర్ ఐపీఓ పై నిపుణులు ఏమంటున్నారు?.. జీఎంపీ ఎంతో తెలుసా?
Blue Jet Healthcare IPO: బ్లూ జెట్ హెల్త్ కేర్ (Blue Jet Healthcare) సంస్థ ఐపీఓ ప్రారంభమైంది. ఈ ఐపీఓకు అక్టోబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు.
Blue Jet Healthcare IPO: అక్టోబర్ 25, బుధవారం ప్రారంభమైన బ్లూ జెట్ హెల్త్ కేర్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గ్రే మార్కెట్లో ఈ ఐపీఓ షేర్లు తొలి రోజే రూ. 85 ప్రీమియంతో ట్రేడ్ అవుతుండడం విశేషం. ఐపీఓ ప్రారంభమైన తొలి రోజు, అక్టోబర్ 25 మధ్యాహ్నం 12.45 గంటలకు 0.27% బిడ్డింగ్ జరిగింది. ఇందులో రిటైల్ పోర్షన్ 0.38% సబ్ స్క్రైబ్ అయింది. ఎన్ఐఐ వాటా 0.38% సబ్ స్క్రైబ్ అయింది. కాగా, ఐపీఓ మార్కెట్లోకి వచ్చిన తొలిరోజే రూ. 85 జీఎంపీ (GMP) తో ఈ షేర్లు ట్రేడ్ అవుతుండడం విశేషం.
ఐపీఓ వివరాలు..
బ్లూ జెట్ హెల్త్ కేర్ ఐపీఓకు ఈ శుక్రవారం వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓకు సంస్థ రూ. 329 నుంచి రూ. 346 ను ప్రైస్ బ్యాండ్ గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో షేర్ అలాట్మెంట్ కోసం లాట్స్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ లో 43 షేర్లు ఉంటాయి. అంటే, గరిష్ట ప్రైస్ బ్యాండ్ అయిన రూ. 346 తో అప్లై చేయడానికి ఒక్కో లాట్ కు ఇన్వెస్టర్ రూ. 14,878 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 840.27 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షేర్ల అలాట్మెంట్ నవంబర్ 1వ తేదీన జరగవచ్చు. అలాట్ అయిన ఇన్వెస్టర్ల డీమాట్ ఖాతాల్లోకి ఈ షేర్లు నవంబర్ 3వ తేదీన డిపాజిట్ అవుతాయి. అలాగే, ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో నవంబర్ 6వ తేదీన లిస్ట్ అవుతాయి.
అప్లై చేయొచ్చా?
ఈ ఐపీఓకు అప్లై చేసే విషయంపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు పలు సూచనలు చేశాయి. కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని, లిస్టింగ్ గెయిన్స్ కోసమే కాకుండా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఈ స్టాక్స్ ను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచిస్తున్నాయి. సంస్థ ప్రొడక్ట్ ప్రొఫైల్ బావుందని, సంస్థకు విశ్వసనీయమైన క్లయింట్ బేస్ ఉందని, 2020 -23 మధ్య సంస్థ గణనీయమమైన వృద్ధిని సాధించిందని చాయిస్ బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. అందువల్ల ఈ ఐపీఓకు ‘సబ్ స్క్రైబ్’ ఆప్షన్ ఇస్తున్నట్లు తెలిపింది. సంబంధిత రంగంలో దాదాపు రెండు దశాబ్దాల అనుభవం, భవిష్యత్తులో వృద్ధికి మంచి అవకాశాలు ఉన్న బ్లూజెట్ హెల్త్ కేర్ ఐపీఓకు సబ్ స్క్రైబ్ ట్యాగ్ ను ఇస్తున్నట్లు రిలయన్స్ సెక్యూరిటీస్ తెలిపింది.