Sensex crash today: స్టాక్ మార్కెట్ బుధవారం ఇలా కుప్పకూలడానికి పలు కారణాలను విశ్లేషకులు వివరిస్తున్నారు. వాటిలో ప్రధానమైనది ప్రాఫిట్ బుకింగ్. పీఎస్ యూ బ్యాంక్, రియల్టీ, ఆటో, ఆయిల్, గ్యాస్ షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీగా నష్టపోయాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 790.34 పాయింట్లు లేదా 1.08% నష్టపోయి, 72,304.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 247.20 పాయింట్లు లేదా 1.11% నష్ట పోయి 21,951.15 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 1.87 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1.94 శాతం నష్టపోయాయి.
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (profit booking) వెల్లువెత్తడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీనికితోడు ఫిబ్రవరి 29వ తేదీ గురువారం ఎఫ్ అండ్ ఓ గడువు ముగియనుండటంతో ట్రేడర్లు హోల్డింగ్స్ ను మరుసటి రోజుకు వాయిదా వేయడం అస్థిరతకు కారణమైంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1,000 పాయింట్లకు పైగా పడిపోవడంతో బుధవారం సెషన్ లో 90 స్టాక్స్ నష్టాల్లో ట్రేడయ్యాయి.