Scholarships for Engineering students: ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఆఫర్ చేస్తున్న భారతి ఎయిర్టెల్
Scholarships: ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రముఖ టెలీకాం సంస్థ భారతి ఎయిర్టెల్ కు చెందిన భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ స్కాలర్ షిప్ ప్రొగ్రామ్ లో ల్యాప్ టాప్, మెస్ ఫీ వంటి ఇతర ప్రయోజనాలున్నాయి.

Bharti Airtel Scholarships: భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛారిటీ విభాగమైన భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ తన 25 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'భారతీ ఎయిర్టెల్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది. ఈ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్ విభిన్న సామాజిక-ఆర్థిక నేపథ్యాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు ఆర్థిక మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుందని ఫౌండేషన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థినులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.
స్కాలర్ షిప్ పొందడానికి అర్హతలు
టెక్నాలజీ ఆధారిత ఇంజినీరింగ్ కోర్సులు చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ కాలేజీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందడానికి అర్హులు. అలాగే, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8.5 లక్షలు మించనివారికి మాత్రమే ఈ స్కాలర్ షిప్ పొందడానికిి అర్హత ఉంటుంది. ఈ స్కాలర్ షిప్ పొందిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకు కళాశాల ఫీజులో 100 శాతం పొందుతారు. అలాగే, వారికి ల్యాప్ టాప్, హాస్టల్, మెస్ ఫీజులు కూడా అందజేస్తారు.
రూ. 100 కోట్లతో 4 వేల మందికి..
ఈ ఏడాది 250 మంది అర్హులైన విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందజేస్తామని భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ వెల్లడించింది. ప్రతి సంవత్సరం ఈ స్కాలర్ షిప్ పొందే విద్యార్థుల సంఖ్యను పెంచుతామని తెలిపింది. ఏడాదికి రూ.100+ కోట్లతో, ప్రతీ సంవత్సరం 4,000 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలన్నది తమ లక్ష్యమని ఫౌండేషన్ తెలిపింది. స్కాలర్ షిప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, ఫౌండేషన్ అధికారిక వెబ్ సైట్ bhartifoundation.org/bharti-airtel-scholarship ను సందర్శించండి.