Bharat NCAP : భారత్​ ఎన్​సీఏపీ లాంచ్​.. అక్టోబర్​ నుంచి అమలు!-bharat ncap launches as indias indigenous car crash test program ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bharat Ncap : భారత్​ ఎన్​సీఏపీ లాంచ్​.. అక్టోబర్​ నుంచి అమలు!

Bharat NCAP : భారత్​ ఎన్​సీఏపీ లాంచ్​.. అక్టోబర్​ నుంచి అమలు!

Sharath Chitturi HT Telugu
Aug 22, 2023 02:28 PM IST

Bharat NCAP : భారత్​ ఎన్​సీఏపీని లాంచ్​ చేశారు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్​ అక్టోబర్​ నుంచి అందుబాటులోకి రానుంది.

భారత్​ ఎన్​సీఏపీ లాంచ్​.. అక్టోబర్​ నుంచి అమలు!
భారత్​ ఎన్​సీఏపీ లాంచ్​.. అక్టోబర్​ నుంచి అమలు!

Bharat NCAP launched : భారత దేశంలో రోడ్డు భద్రత, వాహనాల ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. భారత్​ ఎన్​సీఏపీ (భారత్​ న్యూ కార్​ అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​)ని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ మంగళవారం లాంచ్​ చేశారు. ఈ ప్రోగ్రామ్​.. దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్​ నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా.. దేశీయంగా కార్​ క్రాష్​ టెస్ట్​ ప్రోగ్రామ్​ కలిగి ఉన్న 5వ దేశంగా ఇండియా నిలువనుంది. అమెరికా, చైనా, జపాన్​, దక్షిణ కొరియాలు ముందు ఉన్నాయి.

వినియోగదారుల భద్రతే లక్ష్యంగా..!

దేశీయ ఆటోమొబైల్​ మార్కెట్​ వేగంగా వృద్ధిచెందుతోంది. ఇప్పటికే చాలా మోడల్స్​ రోడ్డు మీద తిరుగుతున్నాయి. రానున్న సంవత్సరాల్లో మరిన్ని మోడల్స్​ అడుగుపెడతాయి. అయితే.. భద్రతపరంగ ఏ వాహనాన్ని ఎంచుకోవాలి? అని ఆలోచిస్తున్న కస్టమర్లకు.. ఈ భారత్​ ఎన్​సీఏపీ ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.

ఈ ప్రోగ్రామ్​.. వాహన భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు ఆటోమొబైల్​ సంస్థలకు కూడా ఉపయోగకరంగా ఉండనుంది. ఎన్​సీఏపీలో భాగంగా 3500 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్న వాహనాలను టెస్ట్​ చేశారు. ఇందులో మంచి స్కోర్​ సాధిస్తే, అంతర్జాతీయంగానూ వాహనాలకు డిమాండ్​ పెరుగుతుంది. తద్వారా ఎగుమతులు కూడా మెరుగుపడతాయి. ఈ ప్రోగ్రామ్​ను మహీంద్రా అండ్​ మహీంద్రా, టయోటా, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్​ వంటి సంస్థలు ఇప్పటికే ప్రశంసించాయి.

Bharat NCAP rating : భారత్​ ఎన్​సీఏపీలో భాగంగా.. వాహనాల తయారీ సంస్థలు, తమ మోడల్స్​ను ఏఐఎస్​ 197 (ఆటోమోటివ్​ ఇండస్ట్రీ స్టాండర్డ్​) కింద వాలంటరీ టెస్టింగ్​కు ఇవ్వొచ్చు. ఇది స్వచ్ఛందమే అయినా, సంస్థలన్నీ ఇందులో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తామని కేంద్రం చెబుతోంది. అంతేకాకుండా.. ఈ ప్రోగ్రామ్​ కింద అధికారులకు.. ఏ షోరూమ్​ నుంచైనా, ఏ వాహనాన్నైనా పిక్​ చేసి పరీక్షించే అధికారం వస్తుంది.

గ్లోబల్​ ఎన్​సీఏపీ, యూరో ఎన్​సీఏపీ వంటి టెస్టింగ్​ ప్రోగ్రామ్స్​ను కలగలిపి ఈ భారత్​ ఎన్​సీఏపీని రూపొందించారు. ఏఓపీ (అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​), సీఓపీ (చైల్డ్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​)తో పాటు వివిధ టెస్ట్​లు నిర్వహించి స్టార్​ రేటింగ్స్​ ఇస్తారు. ఈ టెస్ట్​లో 3, అంతకన్నా ఎక్కువ రేటింగ్​ పొందాలంటే, వాహనాల్లో కచ్చితంగా ఈఎస్​సీ (ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​) ఉండాల్సిందే.

సంబంధిత కథనం