ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే వెయ్యి కిలోమీటర్లు.. రూ.10 లక్షలలోపు ధరలో మైలేజీ ఇచ్చే కార్లు!
Best Mileage Cars : మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా చూసేది కారు ధరతోపాటుగా మైలేజీని. కొన్ని కార్లు బడ్జెట్ ధరలో మంచి మైలేజీ ఇస్తాయి. రూ.10లక్షలలోపు ధరతో ఉన్న కార్లు ఏంటో చూద్దాం..
పెట్రోలు, డీజిల్ పెరుగుతుండటంతో చాలా మంది ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటారు. మీరు కూడా త్వరలో కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే.. మీ కోసం కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కొనే కారు బడ్జెట్ ధరలో ఉండి.. మంచి మైలేజీ ఇస్తే బాగుంటుంది. అలాంటి కార్ల గురించి ఇప్పుడు చూద్దాం..
టాటా పంచ్
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో ఎస్‌యూవీలలో టాటా పంచ్ ఒకటి. దీని బేస్ వేరియంట్ ధర రూ. 6.13 లక్షలు, టాప్ స్పెక్ ధర రూ. 10.20 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాటా పంచ్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు సీఎన్జీ ఇంజన్ ఆప్షన్స్ కలిగి ఉంది. టాటా పంచ్ మైలేజీ గురించి చూస్తే.. దాని పెట్రోల్ వేరియంట్ సుమారు 20కేఎంపీఎల్, సీఎన్జీ వేరియంట్ 27 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. టాటా పంచ్ సేఫ్టీ కూడా బాగుంటుంది. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా అనేక సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.
మారుతి స్విఫ్ట్
మారుతి స్విఫ్ట్ కూడా మంచి మైలేజీతో వస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 6.49 లక్షల నుండి రూ. 9.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. స్విఫ్ట్ 1.2-లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 81.58 పీఎస్ పవర్, 111.7 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇందులో సీఎన్జీ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. స్విఫ్ట్ పెట్రోల్ ఇంజన్‌తో దాదాపు 25 కేఎంపీఎల్, సీఎన్జీతో 34కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది.
మారుతి సుజుకి డిజైర్
మారుతి సుజుకి ఇటీవల డిజైర్‌ను అప్డేట్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ఈ సెడాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.79 లక్షల నుండి రూ. 10.14 లక్షల మధ్య ఉంటుంది. కొత్త డిజైర్ జెడ్-సిరీస్ నుండి కొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మారుతి సుజుకి డిజైర్‌లో సీఎన్జీ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. సీఎన్జీ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కొత్త మారుతి సుజుకి డిజైర్ పెట్రోల్‌తో 25కేఎంపీఎల్, సీఎన్జీ ఇంధనంతో దాదాపు 34 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది 37 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. ఒకసారి ఫుల్ చేస్తే.. 1000 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు.