ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన గృహ రుణాల వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. గతంలో 7.50% ఉన్న వడ్డీ రేటును ఇప్పుడు సంవత్సరానికి 7.45%కు తగ్గించినట్లు ప్రకటించింది. అంతేకాకుండా, కొత్తగా రుణాలు తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజును కూడా పూర్తిగా రద్దు చేసినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును తగ్గించిన తర్వాత, బ్యాంక్ ఆఫ్ బరోడా జూన్‌లో తమ గృహ రుణ వడ్డీ రేట్లను 8.00% నుంచి 7.50%కు తగ్గించింది. మళ్లీ ఇప్పుడు 7.45శాతానికి తీసుకొచ్చింది.
ఈ తాజా తగ్గింపుతో గృహ కొనుగోలు మరింత సరసమైనదిగా మారుతుందని, దేశంలో గృహ నిర్మాణ రంగంలో డిమాండ్‌ను పెంచాలనే ప్రభుత్వ ఆర్థిక లక్ష్యానికి ఇది మద్దతునిస్తుందని భావిస్తున్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముడాలియార్ మాట్లాడుతూ, "గృహ యజమానులను మరింత చేరువ చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఈ తాజా తగ్గింపు పౌరుల ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడానికి, క్రెడిట్ వృద్ధిని పెంచడానికి ఉపయోగపడుతుంది," అని అన్నారు.
ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్ ఎక్కడ లభిస్తుంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వేగంగా మారుతున్న ద్రవ్య విధాన వాతావరణానికి అనుగుణంగా గృహ రుణాల మంజూరు వ్యూహాలపై దృష్టి సారిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు విధానంలో చేసిన సర్దుబాట్ల ప్రకారం రేటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు అందించడంపై కూడా బ్యాంక్ దృష్టి సారించినట్టు తెలిపింది.
పోటీ వడ్డీ రేట్లతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణాల కోసం పూర్తిగా డిజిటల్ దరఖాస్తు ప్రక్రియను అందిస్తుంది. కస్టమర్‌లు ఆర్థిక సంస్థ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మరింత సమాచారం కోసం సమీపంలోని బ్రాంచ్‌ను సందర్శించవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలోని అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటిగా నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 165 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తుంది. 17 దేశాలలో ఉనికిని కలిగి ఉంది.
గమనిక :
సంవత్సరానికి 7.45% వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు రద్దు అనేది అర్హతకు లోబడి ఉంటాయి. దరఖాస్తుదారు క్రెడిట్ ప్రొఫైల్, రుణ మొత్తం, కాలపరిమితి, ఇతర అంశాల ఆధారంగా ఇవి మారవచ్చు. నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. వివరణాత్మక సమాచారం కోసం దయచేసి www.bankofbaroda.in ను సందర్శించండి లేదా సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌ను సంప్రదించండి.
(గమనిక- ఇది సమచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. లోన్ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)
సంబంధిత కథనం