మీకు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉందా? ఈ పని చేయకపోతే 20 శాతం ట్యాక్స్-bank depositors must submit form 15g or form 15h to avoid tds on fd interest income ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మీకు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉందా? ఈ పని చేయకపోతే 20 శాతం ట్యాక్స్

మీకు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉందా? ఈ పని చేయకపోతే 20 శాతం ట్యాక్స్

Anand Sai HT Telugu

మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? పెద్ద మొత్తంలో ఎఫ్‌డీ ఉంచి అధిక వడ్డీ ఆదాయాన్ని సంపాదిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసే బ్యాంకుకు ఫారం 15G, ఫారం 15Hలను సమర్పించాలి. ఇది మిస్ చేయినట్టైతే 20 శాతం టీడీఎస్ ఉంటుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ట్యాక్స్

మీకు బ్యాంకులో పెద్ద మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉందా? దీని ద్వారా మీకు వడ్డీ ఆదాయం వస్తుందా? మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా మీ వడ్డీ ఆదాయం నిర్దేశించిన పరిమితిని మించి ఉంటే 20 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ పనిని పూర్తి చేయడం ద్వారా మీరు పన్నులను నివారించవచ్చు.

సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్

మీరు మీ ఎఫ్‌డీ ఉంచిన బ్యాంకుకు ఫారం 15G, ఫారం 15H సమర్పించడం ద్వారా వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ని నివారించవచ్చు. ఇవి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్. ఈ ఫారమ్‌లను సమర్పించే వారికి టీడీఎస్ కట్ కాదు. మీ వడ్డీ ఆదాయం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి మీరు ఫారం 15G, ఫారం 15H దాఖలు చేయకపోతే అప్పుడు 20 శాతం పన్ను కట్టాలి.

ఈ పరిమితి మించితే

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194A ప్రకారం 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ఉండదు. 60 ఏళ్లలోపు వారికి రూ.40,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఉంది. వడ్డీ ఆదాయం ఈ పరిమితిని మించితే బ్యాంకులు 20 శాతం వరకు టీడీఎస్ వసూలు చేస్తాయి. మీరు పన్ను పరిధిలో లేకుంటే, మీ వడ్డీ ఆదాయం నిర్దేశించిన పరిమితిని మించి ఉంటే బ్యాంకుకు ఫారం 15G లేదా ఫారం 15Hని సమర్పించాలి.

వీరు సబ్మిట్ చేయాలి

ఫారం 15G అనేది 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్లు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు దాఖలు చేయాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఫారం 15H దాఖలు చేయాలి. ఈ ఫారమ్‌ల ద్వారా తమ ఆదాయాలు ఆదాయపు పన్ను పరిమితిలో ఉన్నాయని ప్రకటించాలి. ఇలా చేస్తే మీ వడ్డీ ఆదాయంపై ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బ్యాంకులకు ఈ ఫారమ్స్ సమర్పించాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.