బజాజ్ ఆటో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతున్న చేతక్ ఈ-స్కూటర్ కన్నా తక్కువ ధర ఉంటుందని సమాచారం. కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ మ్యూల్ ఇప్పటికే పబ్లిక్ రోడ్లపై చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు గత కొంతకాలంగా సరసమైన ప్రయాణికుల విభాగంలో తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీతో పాటు మరికొన్ని ఇప్పటికే ఈ వ్యూహాన్ని అనుసరించాయి. బజాజ్ ఆటో ఒక ప్రధాన ద్విచక్ర వాహన బ్రాండ్. పెరుగుతున్న కమ్యూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పేస్‌లో మార్కెట్ షేరును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ వ్యూహంలో భాగంగా రాబోయే ఈవీ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
రాబోయే బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో చేతక్ లైనప్‌లో కనిపించే మాదిరిగానే ఎల్ఈడీ యూనిట్‌తో కూడిన సర్క్యులర్ హెడ్‌ల్యాంప్ ఉండొచ్చు. బజాజ్ చేతక్‌లో కనిపించే డ్యూయల్ టెయిల్‌లైట్ సెటప్‌కు బదులుగా కొత్త ఈ-స్కూటర్లో సింగిల్-పాడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ ఉంటుంది. ఓవల్ ఆకారంలో వింగ్ మిర్రర్స్, ఫ్రెంట్ ఫోర్క్ కవర్లను కలిగి ఉంటాయి. ఇది ఈవీకి మరింత ప్రీమియం వైబ్‌ని జోడిస్తుంది. రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక కనెక్టివిటీ ఆప్షన్స్‌తో పాటు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కలిగి ఉంటుందని ఆశించవచ్చు. ఫ్రెంట్ ఆప్రాన్ హుక్ ఉంటుంది. ఇది చిన్న వస్తువులను తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.
ఈ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు అని తెలుస్తోంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రధానంగా నగరం, చుట్టుపక్కల రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో హబ్-మౌంటెడ్ మోటారును అమర్చే అవకాశం ఉంది. ఇది మిడ్-మౌంటెడ్ మోటారుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది.
రాబోయే బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సస్పెన్షన్ డ్యూటీ కోసం ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రేర్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది. బ్రేకింగ్ కోసం ఈవీలో ఫ్రెంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ యూనిట్ ఉంటాయి. ఇది రెండు వైపులా 12 ఇంచ్ చక్రాలతో వస్తుంది.
ఇక ఈ కొత్త స్కూటర్ రేంజ్, ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలు రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం