పెట్రోల్ నింపే పని లేదు, ఛార్జింగ్ పెట్టే టెన్షన్ లేదు.. అయినా ఈ స్కూటీ నాన్‌స్టాప్‌గా నడుస్తుంది!
Bajaj E Scooter : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. ఈ రెట్రో స్టైల్ స్కూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మరో ఆప్షన్‌తో బజాజ్ స్కూటర్లు రానున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
బజాజ్ కంపెనీ తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి ఇప్పటికే విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ కొత్త బ్లూ 3202 వేరియంట్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు అనేక వేరియంట్లను ఇందులో చేర్చారు. ఈ కారణంగా ఈ విభాగంలో కూడా వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది బజాజ్. అయితే కంపెనీ స్వాపబుల్ బ్యాటరీ మోడల్ కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
వాస్తవానికి కంపెనీ ఈ కొత్త మోడల్‌పై పనిచేస్తోందని గత సంవత్సరం వార్తలు వచ్చాయి. ఇది స్వాపబుల్ లేదా రిమూవబుల్ బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఛార్జింగ్ స్టేషన్లలో మీరు బ్యాటరీని మార్చుకోవచ్చు. ఇప్పటికే భారత మార్కెట్లో బజాజ్ ఇ-స్కూటర్.. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లతో పోటీ పడుతోంది.
ఈ ఇ-స్కూటర్ గురించి కంపెనీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.., మార్కెట్లో ఛార్జింగ్ స్టేషన్లను తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీనితో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ నుంచి బ్యాటరీలను మార్చుకోవచ్చు. కస్టమర్లు ప్రయాణం చేసేందుకు ఈజీగా ఉంటుంది. అంటే బ్యాటరీ తీసి ఛార్జింగ్ స్టేషన్‌లో ఇచ్చి మరొకటి బిగించుకుని వెళ్లవచ్చు. ఇందులో ఛార్జింగ్ పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాటరీని స్వాప్ చేయడం ద్వారా ప్రయాణాన్ని నిరంతరం కొనసాగించగలుగుతారు. అయితే ఇంట్లోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకునే ఆప్షన్‌ను కూడా కంపెనీ ఇవ్వనుంది.
ఇప్పటికే బజాజ్ చేతక్ బ్లూ 3202ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను రూ .1.15 లక్షలుగా నిర్ణయించారు. బ్లూ 3202 కొత్తగా పేరు మార్చిన అర్బన్ వేరియంట్. బ్యాటరీ సామర్థ్యంలో ఎలాంటి మార్పులు లేకపోయినా ఎక్కువ పరిధి(రేంజ్)ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. విశేషమేమిటంటే ఇంతకుముందు దీని రేంజ్ 126 కిలోమీటర్లు కాగా ఇప్పుడు 137 కిలోమీటర్లకు పెరిగింది. అంతేకాదు చేతక్ మొదటి అర్బన్ వేరియంట్ ధరను రూ.1.23 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడు రూ.8,000 తక్కువతో ఈ స్కూటీ వస్తుంది.
చేతక్ బ్లూ 3202 ఛార్జింగ్ చూస్తే.. ఆఫ్-బోర్డ్ 650 వాట్ ఛార్జర్ తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల 50 నిమిషాలు పడుతుంది. చేతక్ బ్లూ 3202 ఫీచర్ల పరంగా అర్బన్ వేరియంట్‌ను పోలి ఉంటుంది. అంటే కీలెస్ ఇగ్నీషన్, కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే లభిస్తుంది. స్పోర్ట్స్ మోడ్ గంటకు 73 కిలోమీటర్ల గరిష్ట వేగం, బ్లూటూత్ కనెక్టివిటీ, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్ కూడా ఇందులో ఉన్నాయి. బ్లూ, వైట్, బ్లాక్, గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
కంపెనీ తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పోర్ట్‌ఫోలియోలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్‌ను ఆగస్టులో విడుదల చేసింది. కంపెనీ దీనికి చేతక్ 3201 అని పేరు పెట్టింది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 136 కిలోమీటర్లు నడుస్తుందని పేర్కొంది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధర ఈఎంపీఎస్-2024 స్కీమ్‌తో వస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే వినియోగదారులు దీనిని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ స్కూటర్ దాని టాప్-స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇందులో మార్పులు కూడా చేశారు. ఇది బ్రూక్లిన్ బ్లాక్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ స్కూటర్ ప్రత్యేక ఫీచర్ల గురించి చూసినట్టైతే ఐపీ 67 రేటింగ్ పొందింది. ఇది వాటర్ రెసిస్టెన్స్‌గా ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, చేతక్ యాప్, కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హజార్డ్ లైట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
టాపిక్