మెజాన్ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సోమవారం నాడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద అంతరాయాన్ని ఎదుర్కొంది. దీని ప్రభావం సోషల్ మీడియా, గేమింగ్, స్ట్రీమింగ్, ఆర్థిక యాప్‌లతో సహా అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై పడింది.
అమెజాన్ ఈ సమస్యను 'పూర్తిగా పరిష్కరించాము' అని ప్రకటించినప్పటికీ, స్నాప్‌చాట్, వెన్మో, పింటెరెస్ట్, ఆపిల్ టీవీ, రెడిట్, రోబ్లాక్స్ వంటి ప్రముఖ సర్వీసులలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు.
AWS అంతరాయానికి ప్రధాన కారణం "అంతర్లీన DNS సమస్య" అని అమెజాన్ ధృవీకరించింది. DNS (Domain Name System) అనేది ఇంటర్నెట్ యొక్క 'ఫోన్‌బుక్' లాంటిది. ఇది వెబ్‌సైట్ పేర్లను సంఖ్యా IP చిరునామాలుగా మారుస్తుంది. ఈ కీలకమైన వ్యవస్థలో లోపం తలెత్తడం వల్లే అంతరాయం మొదలైంది.
ఈ సంఘటన ప్రాథమికంగా AWS కార్యకలాపాలకు కీలక కేంద్రమైన US-ఈస్ట్-1 (నార్త్ వర్జీనియా) ప్రాంతంలో మొదలైంది. అక్కడి నుంచి గ్లోబల్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై విస్తృత ప్రభావం చూపింది.
ఉదయం 6:35 గంటలకు (ఈస్టర్న్ టైమ్) ఈ అంతరాయం 'పూర్తిగా పరిష్కరించబడింది' అని AWS ప్రకటించింది. అయితే, కొన్ని సేవల్లో ఇప్పటికీ ఎక్కువ లోపాలు (Elevated Errors) కొనసాగుతున్నాయని ఇంజనీర్లు ఆ తర్వాత స్పష్టం చేశారు.
మానిటరింగ్ సైట్ డౌన్‌డిటెక్టర్ (Downdetector) ప్రకారం, అధిక ట్రాఫిక్ ఉన్న ప్లాట్‌ఫారమ్‌లైన స్నాప్‌చాట్, పింటెరెస్ట్, వాట్సాప్, సిగ్నల్, జూమ్, ఫోర్ట్‌నైట్, ఎక్స్‌బాక్స్, యూట్యూబ్ వంటి వాటిల్లో యూజర్లు అంతరాయాన్ని నివేదించారు.
క్యాన్వా, డ్యుయోలింగో, స్ట్రావా, పెలోటన్ వంటి ఉత్పాదకత, జీవనశైలి యాప్‌లు కూడా లోపాలను ఎదుర్కొన్నాయి.
ఫోటో షేరింగ్ సైట్ ఫ్లికర్ తాము "ప్రధాన AWS సమస్య కారణంగా తాత్కాలికంగా అందుబాటులో లేమని" ధృవీకరించింది.
AWS సాంకేతిక అప్‌డేట్‌ల శ్రేణిని విడుదల చేసింది. "అన్ని AWS సర్వీసులలో రికవరీని గమనిస్తున్నాం" అని కంపెనీ తెలిపింది. US-ఈస్ట్-1 ప్రాంతంలోని అనేక ‘అవైలబిలిటీ జోన్స్’లో పురోగతి సాధిస్తున్నామని పేర్కొంది.
ల్యాంబ్డా (Lambda), SQS వంటి సర్వీసులలో నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్యలను పరిష్కరిస్తున్నందున, వినియోగదారులు ఇతర సర్వీసులకు నెట్‌వర్క్ అభ్యర్థనలు చేసేటప్పుడు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించింది.
ఉదయం 8 గంటల సమయానికి, AWS ఇంజనీర్లు అంతరాయ స్థితిని "క్షీణించిన (degraded)" స్థాయి నుంచి "ప్రభావితమైన (impacted)" స్థాయికి తగ్గించారు. ఆలస్యమైన యూజర్ అభ్యర్థనల బ్యాక్‌లాగ్ ఇంకా తొలగిపోతోందని వారు పేర్కొన్నారు.
లౌబరో యూనివర్శిటీకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ప్రొఫెసర్ ఓలి బక్లీ, ఈ సంఘటనను “అత్యంత కీలకమైనది”గా అభివర్ణించారు. ఇది ఆధునిక ఇంటర్నెట్ నిర్మాణంలోని పెళుసుదనాన్ని బట్టబయలు చేసిందని ఆయన అన్నారు.
"ఈ ఉదయం మనం చూస్తున్నది AWS లో సంభవించిన ప్రధాన అంతరాయం. ఇది వర్జీనియాలోని US-ఈస్ట్-1 ప్రాంతంలో కేంద్రీకృతమై, ప్రపంచమంతటా విస్తరించింది. మనం ఆధారపడే అనేక వెబ్‌సైట్‌లు, యాప్‌లు, సర్వీసులను ప్రభావితం చేసింది" అని బక్లీ వివరించారు.
DNS సమస్య వేలాది సిస్టమ్‌లను తాకుతుంది. అవి సరైన సర్వర్‌ను కనుగొనలేకపోవడంతో వేగం తగ్గి, చివరికి పనిచేయడం ఆగిపోతాయని ఆయన తెలిపారు.
AWS అనేది ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలలో చాలా భాగానికి వెన్నెముక లాంటిది. ఈ అంతరాయం క్లౌడ్ సేవలపై ప్రపంచ డిజిటల్ ఆధారపడటం ఎంత ఉందో స్పష్టంగా గుర్తుచేసింది. ఇటువంటి చిన్న లోపాలు కూడా వేలాది గ్లోబల్ వ్యాపారాలకు భారీ ఆర్థిక, కార్యాచరణ నష్టాలను కలిగిస్తాయి.
సిస్టమ్‌లలో పూర్తి స్థిరత్వం తిరిగి వస్తోందని AWS ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే, తాత్కాలికంగా పనితీరు నెమ్మదించడం కొనసాగే అవకాశం ఉంది. ఈ సాంకేతిక కారణంపై పూర్తి పోస్ట్‌మార్టమ్ వివరాలను, పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కంపెనీ ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
ప్రొఫెసర్ బక్లీ చెప్పినట్లుగా, ఈ సంఘటన ఆధునిక డిజిటల్ యుగంలోని ఒక కీలక సత్యాన్ని నొక్కి చెబుతోంది. ప్రసిద్ధ సర్వీసులు కేవలం కొన్ని ప్రొవైడర్లు, సర్వీసులపైనే ఆధారపడి ఉన్నాయో ఇది చాలా స్పష్టంగా గుర్తుచేస్తుంది.