TVS iQube ST EV : టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. అమ్మకాల్లో దూసుకెళ్లేందుకు కొత్త మోడల్!
TVS iQube ST Electric Scooter : టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే ఈవీ మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. అయిత మరో మోడల్ కూడా ఈ కంపెనీ నుంచి రానుంది. అదే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ ఈవీ. దీంతో అమ్మకాలు మరింత పెంచుకోవాలని కంపెనీ చూస్తోంది.
టీవీఎస్ కంపెనీ పేరు భారత్‌లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. గల్లీ నుంచి దిల్లీ దాకా అందరికీ కంపెనీ తెలుసు. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. ఇప్పటికే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. మరోవైపు దిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ సరికొత్త 2025 iQube ST కాన్సెప్ట్ ఇ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దాని గురించి చూద్దాం..

కొత్త 2025 టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా పాత iCube ST డిజైన్‌ను పోలి ఉంటుంది. అయితే ఈ కొత్త స్కూటర్‌లో క్విల్టెడ్ సీట్, బ్యాక్‌రెస్ట్, వినూత్న ఫ్లోర్‌బోర్డ్ ఉన్నాయి. చూసేవారి దృష్టిని ఆకర్షించే కలర్ కూడా కలిగి ఉంటుంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ ఇ-స్కూటర్ బ్యాటరీ గురించి కంపెనీ ఎలాంటి వివరాలైతే వెల్లడించలేదు. ప్రస్తుతం ఉన్న ఐక్యూబ్ ఎస్టీ మోడల్ తరహాలోనే ఇది ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కొనుగోలు కోసం అందుబాటులో ఉన్న iCube ST 3.4 కిలోవాట్, 5.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ కలిగి ఉంది. ఇది ఫుల్ ఛార్జింగ్‌తో 100 నుంచి 150 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ ఇ-స్కూటర్‌లో మునుపటి మోడల్ మాదిరిగానే 7-అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ముందు(టెలిస్కోపిక్ ఫోర్క్), వెనుక (అరుదైన) ట్విన్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్ సెటప్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఏడాది చివర్లో కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ స్కూటర్‌ను విడుదల చేయవచ్చు. కొత్త వేరియంట్‌గా పరిచయం అవుతుంది. ప్రస్తుతం కస్టమర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఇ-స్కూటర్ ధర రూ. 1.85 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.
ప్రస్తుతం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న సాధారణ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.94,999 (ఎక్స్-షోరూమ్). 2.2 కిలోవాట్ (kWh) కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో ఉంటుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల రేంజ్ (మైలేజీ) ఇస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ ఈవీ ధర తెలియాల్సి ఉంది.
కొత్త టీవీఎస్ ఐక్యూబ్ దేశీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన ఈ స్కూటర్‌గా అవతరించింది. డిసెంబర్ (2024)లో 20,171 ఐక్యూబ్ యూనిట్లు అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 2023లో 11,288 యూనిట్ల విక్రయించారు. ఏథర్, ఓలా లాంటి కంపెనీలకు టీవీఎస్ గట్టి పోటీ ఇస్తుంది.