Honda Motocompacto EV : ఫోల్డబుల్ ఈవీతో వచ్చిన హోండా.. స్కూటర్‌ను సూట్‌కేస్‌లా మడతపెట్టేయెుచ్చు!
Honda Motocompacto EV : భారత్ మెుబిలిటీ ఆటో ఎక్స్‌పో కొత్త కొత్త వాహనాలు దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకమైన టెక్నాలజీతో తయారుచేసిన వాహనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హోండా కూడా ఫోల్డబుల్ ఈవీని తీసుకువచ్చింది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 దిల్లీలో జరుగుతుంది. ఆటో ఎక్స్‌పోను ఆటో బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను, భవిష్యత్తులో తీసుకువచ్చే వాహనాలను ప్రదర్శించడానికి వేదికగా ఉపయోగించుకుంటాయి. ఇప్పుడు ఆటో ఎక్స్‌పోలో హోండా కంపెనీకి చెందిన ఒక ప్రత్యేకమైన వాహనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే హోండా మోటోకాంపాక్టో. ఇది చూసేందుకు సూట్‌కేస్ లాగా ఉంది.
తక్కువ బరువు
ఇది ముందు, వెనుక చక్రాలు, హ్యాండిల్‌బార్, హెడ్‌లైట్ మొదలైన వాటితో వస్తుంది. అలాగే వాహనం పార్కింగ్ చేసేందుకు సైడ్ స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వినూత్న స్కూటర్ బరువు 19 కిలోలు మాత్రమే. తక్కువ బరువు ఉన్నప్పటికీ, ఇది 120 కిలోల వ్యక్తిని కూడా మోయగలదని తయారీదారు పేర్కొంది. దీనిని సూట్‌కేస్ లాగా మడతపెట్టవచ్చు. పార్కింగ్ సమస్య ఉండదు.
మడిచి పక్కనపెట్టొచ్చు
దాని హ్యాండిల్‌బార్ కూడా బయటికి కనిపించకుండా లోపలకు పెట్టవచ్చు. సూట్‌కేస్‌లా మడిచి ఓ మూలలో భద్రపరుచుకోవచ్చు. ఈ స్కూటర్ దాని కాంపాక్ట్ డిజైన్ కారణంగా తీసుకువెళ్లడం సులభంగా ఉంటుంది. మోటోకాంపాక్టో పొడవు కేవలం 742 మిమీ. వెడల్పు 94 ఎంఎం, ఎత్తు 546 ఎంఎంగా ఉంది.
బ్యాటరీ వివరాలు
స్కూటర్‌లో 0.7 kWh బ్యాటరీ అమర్చారు. ఇది 110V సాకెట్‌ను ఉపయోగించి కేవలం 3.5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఫుల్ ఛార్జింగ్ తో గరిష్టంగా 19 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. శాశ్వత మాగ్నెట్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ 490W పీక్ అవుట్‌పుట్, 16 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 24 కి.మీ.
ఇతర ఫీచర్లు
ఆఫీసు, కాలేజీ 10 కి.మీ కంటే తక్కువ దూరంలో ఉంటే దీనిపై హాయిగా వెళ్లొచ్చు. ఈ వాహనంపై ఒక్కరు మాత్రమే ప్రయాణించగలరు. సింగిల్ పర్సన్ సైకిల్‌కు సమానమైన సీటు ఉంటుంది. హోండా మోటోకాంపాక్టోలో వెనుకవైపు రెడ్ లైట్, రైడర్ భద్రత కోసం ముందు వైపున ప్రకాశవంతమైన హెడ్‌లైట్ అమర్చారు. ఇది ఫుట్‌వెల్ స్పేస్, చిన్న స్టోరేజ్ కెపాసిటీ, డిజిటల్ స్పీడోమీటర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కూడా పొందుతుంది.
కాంపాక్ట్, ఫోల్డబుల్ డిజైన్, సమర్థవంతమైన పనితీరుతో మోటోకాంపాక్టో అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ఈ వాహనం భారతదేశంలో ఎప్పుడు విక్రయించబడుతుందో వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఆటో ఎక్స్‌పోలో ఈ బుజ్జీ ఈవీ చూసి అందరూ మురిసిపోయారు.